Retirement Age 64 Years | ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 64?

తెలంగాణ ప్రభుత్వ తన ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని ఇప్పుడున్న 61 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించేందుకు నిధుల లేమి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనిపై జూన్ 2వ తేదీన అధికారికి ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Telangana retirement age increase news

Retirement Age 64 Years | ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో మూడు సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రకటన చేయడమే తరువాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లేదా ఆ తరువాత ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. దీనిని 64 సంవత్సరాలకు పెంచనున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో సుమారు 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రిటైర్ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు పొడిగింపు ఉండబోదని 2025 జూన్ నెలలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే తెర వెనుక మాత్రం మూడు సంవత్సరాల సర్వీసు పొడిగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ శాఖల వారీగా, విభాగాల అధిపతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజ్, గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజిమెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఐఎంఎస్) వెబ్ పోర్టల్ ద్వారా కమిటీ సేకరించింది. గత నెల వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది వరకు పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా ఆ లెక్కలను మదింపు చేసే పనిలో ఆర్థిక శాఖ ఉంది. అయితే చాలా మంది ఆధార్ కు అనుసంధానం చేయలేదని, ఈ ప్రక్రియ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎవరు పొందుతున్నారు, వారి హోదా, వివరాలు కూడా ప్రభుత్వం సేకరించింది. 37వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఫుడ్ సెక్యురిటీ కార్డులు తీసుకున్నట్లు వెల్లడి అయిందని వార్తలు వచ్చాయి. వీరిపై శాఖాపరంగా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురైంది. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని ఊహించిన యువత తీవ్రంగా నష్టపోయింది. బీఆర్ఎస్ పాలనలో నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఒక జనరేషన్ పూర్తిగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది. పదవీ విరమణ ప్రయోజనాలు వేల కోట్లు ఉండటంతో రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంపుదల చేసి, ఆ గండం నుంచి బీఆర్ఎస్ బయటపడింది. అలా సర్వీసు పొడిగింపు పొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిటైర్ అవుతున్నారు. వీళ్లకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా, బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ వద్ద వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిటైర్డు అయిన వారివి, సర్వీసులో ఉన్నవారివి కూడా ఉన్నాయి. ప్రతి నిత్యం వందల మంది రిటైర్డు ఉద్యోగులు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చి రిక్త హస్తంతో వెనక్కి వెళ్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఊహించిన వారికి మొండి చెయ్యి ఇచ్చింది. ఆర్థికంగా నిధులు సర్ధుబాటు కాకపోవడం, వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించడం మూలంగా మిగతా చెల్లింపులకు సమస్యలు వస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 64 కు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 2వ తేదీ లేదా ఆ తరువాత ఎప్పుడు అయినా ప్రకటన వెలువరిస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండున్నర సంవత్సరాలు అవుతుంది, మూడు సంవత్సరాల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కార్ పై ఉంటుందనే ముందు చూపులో భాగంగా ఈ నిర్ణయం అంటున్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే సరి లేదంటే వచ్చే సర్కార్ కు పదవీ విరమణ ప్రయోజనాలు గుదిబండగా మారనున్నాయి. రిటైర్మెంట్ అయిన వారి పెండింగ్ బిల్లులు రూ.10వేల కోట్ల వరకు ఉన్నట్లు ఒక అంచనా.

కేసీఆర్ సర్కార్ రిటైర్మెంట్ వయస్సు పెంపు
ఉద్యోగుల పదవీ విరమణ మొత్తం వేల కోట్ల రూపాయలు ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టు కు చెల్లింపులు ఉండడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకున్నది. 2021 మార్చి నెలలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిటైర్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. రిటైర్ అయ్యే వారికి సకాలంలో చెల్లించకపోవడం, ఆ బకాయిల గుట్ట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పై పడింది.

టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అనుమానమే
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 64 ఏళ్లకు పెంచే నిర్ణయంతో టీజీపీఎస్సీ ఉద్యోగ నిమామకాలు ఉండకపోవచ్చని, జాబ్ క్యాలెండర్ కూడా అనుమానమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఉద్యోగ విరమణలతో ఖాళీలు ఏర్పడుతాయని, కానప్పుడు కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఎలాంటి కొత్త నియామకాలు ఉండవనేది స్పష్టమవుతున్నది.

Krishna Water Dispute | కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్‌ది ద్రోహం, కాంగ్రెస్‌ది నిర్లక్ష్యం!

Latest News