Outsourcing Corporation | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వెతలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏజెన్సీల దోపిడికి గురవుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా.. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరే

telangana outsourcing corporation plan

విధాత, హైదరాబాద్:
Outsourcing Corporation | ఏళ్ల తరబడి దోపిడీకి గురవుతున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లను కాంట్రాక్టు ఏజెన్సీలు పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా లూటీ (exploitation) చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతో కాంట్రాక్టులు దక్కించుకుని పెద్ద ఎత్తున కమీషన్లు నొక్కేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొడుతున్నాయి. ఇకపై ఈ దోపిడీకి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (Outsourcing Corporation) ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సచివాలయ ఉన్నతాధికారులు మాత్రం అడ్డుపడుతున్నారని సమాచారం. ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు వేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. అయినప్పటికీ కార్పొరేషన్ విషయంలో వెనక్కితగ్గవద్దనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.

తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్ నుంచి మండల కార్యాలయాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో సుమారు 4.95 లక్షల మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు వేల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా వీరు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ప్రతి ఏజెన్సీకి 4శాతం మేర కమీషన్లు చెల్లిస్తోంది. ఇలా సుమారు 4.95 లక్షల మంది ఉద్యోగుల కోసం కమీషన్ రూపేణా ప్రతి ఏడాది రూ.600 కోట్లు వెచ్చిస్తున్నది. ఇది కాకుండా గైర్హాజరు, ఇతరత్రా కారణాలు చూపుతూ కోతలు విధించి ఏజెన్సీలు జేబులు నింపుకొంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు, ఏజెన్సీల అక్రమ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా సేకరిస్తున్న సమాచారం ప్రకారం విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కమిటీకి అందిన వివరాల ప్రకారం గతంలో ప్రకటించిన 4,95,000 ఉద్యోగుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారి మధ్య 15,000 వరకు తగ్గుదల కనిపించిందని సమాచారం. ఆధార్ అనుసంధానంతో 15వేల వరకు నకిలీ, బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. మొత్తంగా 4.80 లక్షల మంది పనిచేస్తున్నట్లు లెక్క తేలిందని సమాచారం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం మంజూరుచేసిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును ఏజెన్సీలు తమ జేబుల్లో వేసుకుంటున్నాయని గుర్తించారని వార్తలు వచ్చాయి.

వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిధులను ప్రభుత్వ విభాగాలు ప్రతినెలా మంజూరు చేస్తున్నా సంబంధిత సంస్థల ఖాతాల్లో జమ చేయడం లేదని తేలింది. ఉద్యోగి వాటాతోపాటు ప్రభుత్వం ఇచ్చే వాటా మొత్తాలను ఏజెన్సీలు పది సంవత్సరాలుగా స్వాహా చేస్తున్నాయని తేలింది. ఈ మొత్తాన్ని వెంటనే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేసి, ఆ వివరాలను సమర్పించాలని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. జమ చేయని పక్షంలో ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది.

అత్యధికంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 94,179, విద్యా శాఖ 78,146, మ‌హిళాభివృద్ధి, మునిసిపల్ శాఖ 62,913, శిశు సంక్షేమ శాఖ 60,492, వైద్య, ఆరోగ్య శాఖ 60,934, విద్యుత్ శాఖ 22,223, హోం శాఖ 21,765, మైనారిటీ శాఖ 20,903, రెవెన్యూ 12,843 మంది చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరూ సర్వీసు రంగంలోనే పనిచేస్తుండడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్, ఏపీ ప్రభుత్వం తరహాలో తెలంగాణలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీల చట్టం 2013 ప్రకారం ఉత్తరప్రదేశ్ ఔట్ సోర్స్ సర్వీసు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించింది. రాత పరీక్ష, ఇంటర్వూలు, రిజర్వేషన్ విధానం ద్వారా నియామకాలు చేయాలని, హోదా ప్రకారంగా వేతనాలు రూ.20వేలు, రూ.22వేలు, రూ.25వేలు, అత్యధికంగా రూ.40వేలు ఖరారు చేశారు. నైపుణ్య శిక్షణతో పాటు సర్వీసులో ఉండగా అకస్మాత్తుగా చనిపోతే దహన సంస్కారాలకు రూ.15వేలు మంజూరు చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 93 ప్రభుత్వ విభాగాలలో సుమారు 11 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేషన్ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా మూడేళ్ల కాంట్రాక్టు పద్దతి కింద నియమితులు అయ్యేవారు ప్రతి నెలా 26 రోజులు పనిదినాలు గా ఖరారు చేశారు. అయితే ఏపీలో మొత్తం ఉద్యోగులు కాకుండా కేవలం లక్ష మంది ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం 2013, సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా టీజీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ నుంచే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారని తెలుస్తున్నది. ఇకనుంచి జరిగే నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు అమలు చేయనున్నారని సమాచారం. హాజరును ఆన్ లైన్ లో నమోదు చేసే వ్యవస్థ రానున్నదని చెబుతున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఈపీఎఫ్, ఈఎస్ఐ కచ్చితంగా అమలు కావడమే కాకుండా ప్రతినెలా ఉద్యోగుల ఖాతాల్లో జీతం జమ చేయనున్నారని అంటున్నారు.

City Of Lakes | మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు
Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్‌ పెట్టండి
Pooja Hegde | పూజా హెగ్డే సంచ‌ల‌న ఆరోపణలు.. ఆ హీరో అనుమతి లేకుండా నా కార‌వాన్‌లోకి వచ్చి ..

Latest News