వ్యాయామం (Exercise).. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వారి మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. అనారోగ్యం దరిచేరదు. అయితే, చాలా మంది వ్యాయామాన్ని శారీరక శ్రమగా భావిస్తుంటారు. కానీ, డిప్రెషన్ (Depression)తో బాధపడుతున్న వారికి వ్యాయామం చికిత్సలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
మన పూర్వీకులు ఎలాంటి సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా జీవించేవాళ్లు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ అంటేనే అసలు తెలిసేదికాదు. ఉదయం నుంచి రాత్రి వరకూ శారీరక శ్రమ చేసేవారు. రాత్రికి హాయిగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం అంతా బిజీ యుగం నడుస్తోంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ రోజంతా ఏదో ఒక సమస్యతో మనిషి సతమతమవుతున్నాడు. కుటుంబ సమస్యలు ఒక ఎత్తైతే.. ఉద్యోగ సమస్యలు మనిషిని కుంగదీస్తున్నాయి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కుంగుబాటుకు గురవుతున్నారు. చిన్న విషయానికే డిప్రెషన్‌తో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఈ డిప్రెషన్.. ఎంతటివారినైనా బలితీసుకుంటోంది.
కుంగుబాటు మనిషి జీవితాన్నే దెబ్బతీస్తుంది. గుండెజబ్బు, క్యాన్సర్ వంటి జబ్బులనూ తీవ్రం చేస్తుంది. అన్ని విషయాల మీదా ఆసక్తిని చంపేసి మనిషిని ఏకాకిని చేస్తుంది. కొందరు డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటారు. మందులు వాడతారు. వాటితోపాటూ వ్యాయామం చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుందట. కుంగుబాటుకు వ్యాయామం చక్కటి పరిష్కారమని తాజా అధ్యయనంలో తేలింది. డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని యూకేలోని లాంక్‌షైర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూ క్లెగ్ తాజాగా తెలిపారు.
రోజూ అరగంటసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా నడక, పరుగు, బరువులు ఎత్తడం, యోగా.. డిప్రెషన్‌ను తగ్గించడంలో సాయపడతాయి. వ్యాయామంతో జన్యుపరమైన మానసిక రుగ్మతలను కూడా నిరోధించుకోవచ్చునట. కుంగుబాటుతో బాధపడే వారు ప్రతిరోజు వ్యాయామం చేస్తే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని తేల్చారు. కుంగుబాటుకే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వ్యాయామం ఒక చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Harish Rao | దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
