Proteins | ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని( Health ) సురక్షితంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హెల్తీ ఫుడ్( Healthy Food ) పట్ల మక్కువ చూపిస్తున్నారు. జంక్ ఫుడ్( Junk Food )కు దూరంగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్( Proteins )ను తీసుకుని శరీరాన్ని హెల్తీగా ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ప్రోటీన్ ఫుడ్ కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకునే వారు తప్పనిసరిగా వర్కవుట్స్ చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. లేదంటే ఫలితం పూర్తి భిన్నంగా ఉంటుంది. శారీరక శ్రమ లేని శరీరానికి అదనంగా ప్రోటీన్లు అందిస్తే అవి క్యాలరీలుగా కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉండిపోతాయి. దాంతో బరువు పెరుగుతారు. ఇలా వచ్చిన అదనపు బరువు తగ్గించుకోవాలంటే అదనంగా శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు.. అధిక మోతాదులో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మూలంగా.. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో పాటు బోన్ లాస్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. శరీరంలో డీహైడ్రేషన్‌కు కూడా కారణం అవుతుందని పేర్కొంటున్నారు.
ఎముకలు బలహీనం ( Bone Loss )
అత్యధిక ప్రోటీన్లు తీసుకుంటే శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో శరీరం ఎక్కువైన యాసిడ్‌ను విసర్జించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఎముకల నుంచి కాల్షియం కూడా యూరిన్ ద్వారా విసర్జించబడుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడుతాయి.
కిడ్నీ డ్యామేజ్ ( Kidney Damage )
ప్రోటీన్ ఫుడ్ అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. అధిక ప్రోటీన్ వల్ల కీటోన్లు అనే వేస్ట్ శరీరంలో పెరుగుతుంది. దీన్ని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలకు ఎంతో శ్రమ అవసరం. ఇలా దీర్ఘకాలం ఈ ప్రక్రియ కొనసాగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. తద్వారా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది.
డీహైడ్రేషన్ ( Dehydration )
తగినన్ని పిండి పదార్థాలు లేకుండా అత్యధిక ప్రోటీన్లను తీసుకోవడం వల్ల విషపూరిత కీటోన్లు శరీరంలో పెరుగుతాయి. దాంతో కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. పైగా వ్యాయామం వల్ల చెమట ద్వారా ద్రవాలు వెళ్లిపోతాయి. దీంతో శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి, నీరసానికి గురయ్యే ప్రమాదం ఉంది.
