WHO Warning | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన ఒక స్టడీ ప్రకారం, రోజుకు 3 గంటలకు మించి సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్‌లో టైమ్ గడిపే యువతలో యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఏం చెబుతోంది రిసెర్చ్?
15 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 20,000 మందిపై ఈ అధ్యయనం చేశారు. అందులో 64% మంది విద్యార్థులు రోజుకు 4 గంటలకు పైగా ఫోన్, ల్యాప్ టాప్ లపై గడుపుతున్నట్లు తేలింది. వారిలో మూడింట ఒక వంతు (33%) మందికి నిద్ర సమస్యలు, 27% మందికి మానసిక ఒత్తిడి లక్షణాలు కనిపించాయి.
ఎందుకు ఇలా ?
ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల మెదడు విపరీతంగా అలసిపోతుంది. సరైన రెస్ట్ లేక మెదడు పనితీరుపై ఈ ప్రభావం పడుతుంది. అంతేగాక, నిరంతరం నోటిఫికేషన్లు, వర్చువల్ కాంపిటిషన్ వల్ల డోపమైన్ స్థాయిలు అసమతుల్యం అవుతాయి. ఫలితంగా అలసట, ఫోకస్ తగ్గిపోవడం, ఎమోషనల్ గా స్టెబిలిటీ లేకపోవడం లాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మరి ఫోన్ మొత్తం మానేయాలా?
అసలు ఫోన్ వాడకుండా ఉండటం ఈ రోజుల్లో సాధ్యం కాదు. విద్యార్థులకు కూడా ప్రాజెక్టు వర్కు కోసమో, ఆన్ లైన్ క్లాసుల కోసమో ఆన్ లైన్ లో ఉండటం తప్పనిసరి. అయితే ఈ టైంతో కలుపుకొని, స్క్రీన్ టైం పట్ల నియంత్రణ ఏర్పరుచుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. స్కూల్ లేదా కాలేజీ వర్కు ఉన్నప్పుడు ఎప్పుడైనా అయితే ఓకే గానీ, స్టడీ తో పనిలేకుండా రీల్స్ కోసమో, ఇతర సోషల్ మీడియా ఆపరేటింగ్ కోసమో అయితే ఎక్కువ సమయం ఫోన్ లో గడపకుండా చూసుకోవాలి. రోజుకు 2 గంటలకంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ వద్దని సూచిస్తున్నారు.
- పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఫోన్ వాడటాన్ని ఆపేయాలి.
- ఆన్లైన్ ఫ్రెండ్స్ కంటే, ప్రత్యక్ష మిత్రులతో గడపడం మానసిక ఆరోగ్యానికి ఉత్తమం.
- యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేస్తే మానసిక ప్రశాంతత పెరిగి, బ్రెయిన్ కి రెస్టు దొరుకుతుంది.
- డిజిటల్ డీటాక్స్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కాదు, అవసరం.
- టెక్నాలజీ వల్ల లైఫ్ సౌకర్యవంతమైంది కానీ, దాన్ని కంట్రోల్ చేయకపోతే మన సైకాలజీని అది కంట్రోల్ చేస్తుంది.