Covid Vaccines : కొవిడ్ వ్యాక్సిన్ల‌ వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌రా..? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?

కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. టీకాలు పిల్లలు పుట్టడంపై ఎలాంటి ప్రభావం చూపవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Covid vaccines

ఆరేండ్ల క్రితం తొలిసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కొవిడ్‌-19 మహమ్మారిని అడ్డుకునేందుకు ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ల‌ను (Covid vaccines) తయారు చేసి అందుబాటులోకి తెచ్చిన‌ విష‌యం తెలిసిందే. అయితే, ఈ కొవిడ్ వ్యాక్సిన్ల వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు క‌లుగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ల వ‌ల్లే ఆకస్మిక మరణాలు (Sudden deaths) సంభ‌విస్తున్నాయంటూ అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అంతేకాదు, గుండెపోటు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుతోంది. ఇక ఈ వ్యాక్సిన్ల వ‌ల్ల సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం కూడా త‌గ్గుతుందంటూ (low fertility) వదంతులు వ‌చ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేద‌ని ఓ అధ్య‌య‌నం తేల్చింది.

స్వీడ‌న్‌లోని లింకోపింగ్ వ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 60 వేల మంది మ‌హిళ‌ల‌పై అధ్య‌య‌నం చేశారు. ఈ అధ్య‌య‌నంలో కొవిడ్ టీకా తీసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశాల‌పై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌ద‌ని తేలింది. ఈ ప‌రిశోధ‌న వివ‌రాలు ‘కమ్యూనికేషన్స్ మెడిసిన్’ అనే ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురిత‌మ‌య్యాయి.

టీకాలు కార‌ణం కాదు..

టీకాలు తీసుకోవ‌డం వ‌ల్ల సంతానోత్ప‌త్తి త‌గ్గింద‌ని సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా మ‌హ‌మ్మారి త‌ర్వాత స్వీడ‌న్ స‌హా కొన్ని దేశాల్లో జ‌న‌నాల సంఖ్య త‌గ్గింది. ఇందుకు కార‌ణం కొవిడ్ వ్యాక్సిన్లే కావొచ్చ‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అయితే, “మహమ్మారి సమయంలో జననాల రేటు తగ్గడానికి mRNA కోవిడ్-19 వ్యాక్సిన్లే కారణం అనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని మహిళల మధ్య జననాల రేటులో మేము ఏ తేడానూ గమనించలేదు” అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టూమాస్ టింప్కా తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్‌పై సందేహం అక్క‌ర్లేదు : ప్రొఫెసర్ టింప్కా

ఈ అధ్య‌య‌నంలో వ‌య‌సు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు వంటి అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఫలితాల‌ను విశ్లేషించారు. కొవిడ్ ఇన్ఫెక్ష‌న్ గ‌ర్భిణుల‌కు ప్ర‌మాద‌క‌ర‌మే అయినా, వ్యాక్సిన్ ఆ ప్ర‌మాదాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంద‌ని ప్రొఫెసర్ టింప్కా తెలిపారు. అందుకే కుటుంబ జీవితం ప్రారంభించాలనుకునే మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి :

India vs Australia : అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ సెంచరీ
Tiger Tension : పెద్ద పులుల భయంలో తెలుగు రాష్ట్రాలు !

Latest News