- ట్రాఫిక్ కెమెరాలు హ్యాక్
- మొబైల్ ఫోన్ లోకి చొరబడ్డారు
- ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్ తీరిది
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీ. దశాబ్ధాల పాటు తిరుగులేకుండా దేశాన్ని శాసించిన అగ్రనేత. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వైమానిక దాడుల్లో సులువుగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు (ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం) ఆ దేశ రాజధాని టెహ్రాన్ నగరం డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కార్యాలయంపై జరిగిన బాంబుల దాడిలో 86 సంవత్సరాల ఖమేనీ మరణించారు. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఉన్నతాధికారి మేజర్ జనరల్ మహమ్మద్ పాక్ పౌర్‌తో పలువురు ప్రభుత్వ ప్రముఖులు కూడా చనిపోయారు. వైమానిక దాడుల్లోనే అందరూ మరణించారని, శనివారం ఉదయం డజన్ల సంఖ్యలో ఉన్న సైనిక స్థావరాలపై అమెరికాతో కలిసి సమన్వయం చేసుకుంటూ దాడులు చేశామని ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఐడీఎఫ్ కూడా వెల్లడించింది. దీన్నే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి.
ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికా దేశానికి ముప్పుగా పరిణమించాడంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని మట్టుబెట్టాలని కొన్నేళ్ల క్రితమే ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సంయుక్తంగా తీర్మానించాయి. పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేశాయి. నెలలు కాదు సంవత్సరాల తరబడి వేచి చూసి, అదును దొరకగానే తెగబడి ఆయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీని ఖతం చేశాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన మొస్సాద్, అమెరికా దేశానికి చెందిన సీఐఏ ఇందులో కీలక పాత్ర పోషించాయి. సంవత్సరాల నుంచి టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరా నెట్ వర్క్‌ను హ్యాక్ చేస్తున్నాయని తెలుస్తున్నది. ఖమేనీ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఆయన దినచర్యలు ఏమిటి? అల్ఫాహారం ఎప్పుడు తీసుకుంటారు? ఏ రకమైన ఆహారం తీసుకుంటారు? ఎవరు వడ్డిస్తారు? ఏ సమయంలో కార్యాలయం నుంచి బయటకు వస్తారు? ఆయన నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారు? ఎంత సమయం సమావేశాలు నిర్వహిస్తారు? వంటి అంశాలపై నిశితంగా గమనించింది. ఇదే కాకుండా ఖమేనీతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ముఖ్య నేతల మొబైల్ ఫోన్ల వ్యవస్థల్లోకి చొరబడింది. సంవత్సరాల తరబడి జరుగుతున్న ఈ హ్యాకింగ్ ను ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ఏమాత్రం పసిగట్టలేకపోయారు.
ట్రాఫిక్ కెమెరాల వీడియో ఫుటేజ్ ను మార్పిడి చేసి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, దక్షిణ ఇజ్రాయెల్ సర్వర్లకు ట్రాన్స్ మిట్ చేశారు. ఈ వీడియోల్లో ఉన్న సమాచారం ఆధారంగా ఖమేనీ ఏ వాహనంలో ప్రయాణిస్తారు? ఆ వాహనానికి ఉన్న భద్రతా ప్రమాణాలు ఏంటి? , మధ్యలో ఎక్కడైనా ఒక వాహనం నుంచి మరో వాహనానికి ఖమేనీ మారతారా? భద్రతా చర్యలు ఏ విధంగా ఉంటాయి? టెహ్రాన్ లోని పాశ్చర్ స్ట్రీట్ లోని కార్యాలయం వద్ద ఏ దిశలో వ్యక్తిగత, భద్రతా వాహనాలను పార్కింగ్ చేస్తారు? అనేది వీక్షించేవారని తెలుస్తున్నది. ఖమేనీ రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయనేది ఒక అంచనాకు వచ్చేవారు. కార్యాలయం ఎక్కడ ఉంది, నివాసం ఎక్కడ ఉంది, తనకు ముప్పు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదిస్తారు, దాడి బెదిరింపులతో ఎలా వెనక్కి తగ్గుతాడు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఏలాంటి ఆదేశాలు ఇస్తారనేది కూడా మొబైల్ ఫోన్ ద్వారా జరిపే చర్చలను బట్టి అధ్యయనం చేసేవారని సమాచారం. అరుదుగా ఒకేచోట కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఇతర సీనియర్ అధికారులు, సైనిక అధికారులను కూడా ట్రాక్ చేశారని చెబుతున్నారు. సెక్యూరిటీ వ్యవస్థలో ఉన్నవారి పేర్లు, చిరునామాలు, ఎన్ని గంటలు పనిచేస్తారు, ఏ మార్గంలో డ్యూటీకి వెళ్తారు, ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే వివరాలు కూడా సేకరించారని సమాచారం. ఇలా ప్రతి రోజు రియల్ టైమ్ డేటా సేకరించి, తమ లక్ష్యాలను ఖరారు చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని డజన్ కు పైగా మొబైల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు. కాల్ చేసినప్పుడు ఫోన్ లు బిజీగా ఉన్నట్లు అనిపించేలా చేసి సుప్రీం లీడర్ రక్షణ వివరాల హెచ్చరికలను అందుకోకుండా నిలువరించారని తెలుస్తున్నది.
సంవత్సరాలుగా చేస్తున్న ట్రాకింగ్, మొబైల్ నెట్ వర్క్ లోకి చొరబడడం వంటి పనులతో పూర్తిగా పక్కా సమాచారం సేకరించి, నిర్థారణకు వచ్చిన తరువాత ముప్పెట దాడికి దిగాలని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. నిర్ణయంలో భాగంగా శనివారం టెహ్రాన్ కాంపౌండ్‌లో ఆయతుల్లా ఖమేనీ శనివారం ఉదయం 6 గంటలకు (ఇజ్రాయెల్ దేశ కాలమానం) సమావేశమవుతున్నారని నిర్థారణకు వచ్చాయి. వాస్తవానికి రాత్రిపూట దాడులు చేయాలని అనకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో పట్టపగలు (ఇరాన్ దేశ కాలమానం) దాడికి దిగాయి. ప్రెషిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రిని ఫైటర్ జెట్ల ద్వారా కాంపౌండ్‌పై ప్రయోగించాయి. పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఇజ్రాయెల్ సైనిక ఉన్నతాధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్ తో మాట్లాడుతూ, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సమన్వయ ఆపరేషన్ 60 సెకన్లలో లక్ష్యాలను పూర్తి చేశాయన్నారు. కేవలం 60 సెకన్ల (ఒక నిమిషం వ్యవధి) దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీ, రివల్యూషనరీ గార్డ్ చీఫ్ తో పాటు సుమారు 40 మంది సీనియర్ ఉన్నతాధికారులు చనిపోయారన్నారు. ఇరాన్ దేశ కాలమానం ప్రకారం పట్టపగలు దాడి చేయడం ప్రపంచ దేశాలనే ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
12 రోజుల యుద్ధంలో ఆ దేశ నిఘా ను పసిగట్టారు
గతేడాది జూన్ నెలలో 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇరాన్ దేశానికి చెందిన అణు శాస్త్రవేత్తలు, ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిమిషాల వ్యవధిలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్తంగా చంపేశాయి. బీ-2 బాంబర్లతో మూడు అణు కేంద్రాలపై అమెరికా విరుచుకుపడింది. ఈ దాడుల్లో అనేక మంది అగ్ర కమాండర్లు, ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఈ 12 రోజుల యుద్ధ సమయంలోనే ఖమేనీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డు దళం మధ్య జరుగుతున్న కమ్యూనికేషన్ తీరును గమనించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వారు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అప్పటి నుంచే ఖమేనీ కదలికలను ఎప్పకప్పుడు పరిశీలించడం, తదుపరి చర్యలను కచ్చితత్వంతో అంచనా వేయడం ప్రారంభించారు.
2024లో పేజర్లతో హెజ్బొల్లాపై దాడులు
తమకు కంటగింపుగా మారిన హిజబొల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ ఎప్పటినుంచో తన ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచంలో ఎవరి ఊహకు అందని విధంగా శత్రువును మట్టుబెట్టేందుకు కాలం చెల్లిన పేజర్ల వ్యవస్థ ను వాడుకున్నది. ప్రతి ఒక్కరు సులువుగా ఉపయోగించే వాకీ టాకీలను కూడా వదల్లేదు. 2024 సెప్టెంబర్ నెలలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన మొస్సాద్ ఈ రెండు పరికరాలను ఉపయోగించి లెబనాన్, సిరియాలో హిజబొల్లా తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. పేజర్లలో పేలుడు సామాగ్రిని అమర్చడంతో పాటు, కొనుగోలుదారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు మొస్సాద్ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది. హంగేరి దేశానికి చెందిన ఒక షెల్ కంపెనీతో జతకట్టి తైవాన్ దేశానికి చెందిన గోల్డ్ అపోలో కు తెలియకుండానే మోసగించింది. మొస్సాద్ తో భాగస్వామ్యం చేసుకునేలా షెల్ కంపెనీ ద్వారా తన దారికి తెచ్చుకున్నది. అయితే ఈ కంపెనీ ఇజ్రాయెల్ తో కలిసి పనిచేస్తున్నట్లు హిజబొల్లాకు కూడా తెలియదు. తొలుత పేజర్ల లోపల పేలుడు పదార్థాలు దాచేందుకు వాటి సైజు కొంచెం పెంచారు. ఈ పేలుడు పదార్థం హెజబొల్లా తీవ్రవాదులకు మాత్రమే హాని కలిగేలా, సమీపంలోని వారికి హాని లేని విధంగా వీటిని తయారు చేశారు. ఈ డమ్మీలపై అనేకసార్లు పరీక్షలు జరిపారు. హెజబొల్లా తీవ్రవాదులు ఎవరైనా సరే రింగ్ టోన్ మోగిన వెంటనే పేజర్లను జేబులో నుంచి తీసేలా ప్రత్యేకంగా రింగ్ టోన్ ను రూపకల్పన చేశారు. ఈ రింగ్ టోన్ ను కూడా అనేకసార్లు పరీక్షించి ఖరారు చేశారు. ఇందుకోసం చాలా రింగ్ టోన్లను వినడమే కాకుండా, ఏ రింగ్ టోన్ అయితే క్షణం ఆలస్యం చేయకుండా తమ జేబులో నుంచి బయటకు తీస్తారనేది కూడా పరీక్షించడం గమనార్హం. గాబ్రియెల్ అనే పేజర్ ఏజెంట్ హిజబొల్లా తీవ్రవాద ప్రముఖులతో తొలుత సంప్రదింపులు జరిపాడు. వీటికి దుమ్ము నుంచి, జలాల నుంచి రక్షణ ఉంటుందని, బ్యాటరీ జీవితం అధికంగా ఉంటుందని యూ ట్యూబ్ ఛానళ్లలో విస్తృతంగా యాడ్స్ కూడా ఇచ్చాడు. ఇది నిజమేనని హిజబొల్లా తీవ్రవాద సంస్థ కూడా బలంగా నమ్మి పాత పేజర్లను తీసివేసి, కొత్త పేజర్లను కొనుగోలు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నది.
