Iran Israel War | హెలికాప్టర్ పెయింటింగ్‌తో.. ఇజ్రాయెల్‌ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సోషల్‌మీడియాలో ఓ వీడియోపై పెద్ద చర్చ జరుగుతోంది.

  • By: raj |    news |    Published on : Mar 06, 2026 9:29 PM IST
Iran Israel War | హెలికాప్టర్ పెయింటింగ్‌తో.. ఇజ్రాయెల్‌ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో

Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సోషల్‌మీడియాలో ఓ వీడియోపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇరాన్‌కు చెందిన Mi-17 హెలికాప్టర్‌ను ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) విడుదల చేసిన వీడియో దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అసలు ఇజ్రాయెల్ నిజంగానే హెలికాప్టర్‌ను కూల్చిందా? లేకపోతే నేల మీద వేసిన పెయింటింగ్‌పై దాడి చేసిందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

 

అసలేం జరిగిందంటే..

 

ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఇటీవల తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేసింది. అందులో ఇరాన్‌లోని రెండు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపి, సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని పేర్కొంది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఆ వీడియోలో Mi-17 హెలికాప్టర్ పార్క్ చేసి ఉండగా.. దానిపై క్షిపణితో దాడి చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన నెటిజన్లు ఇజ్రాయెల్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఎండలో ఉన్న ఏ వస్తువుకు అయినా నీడ ఉంటుందని.. కానీ ఆ హెలికాప్టర్‌కు నీడ ఎందుకు లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. క్షిపణి దాడి జరిగిన తర్వాత కూడా హెలికాప్టర్ ముక్కలు ముక్కలు కాలేదని.. దాని ఆకారం అలాగే కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో అది నిజమైన హెలికాప్టర్ కాకపోవచ్చని.. భూమిపై గీసిన పెయింటింగ్‌ను కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

 

అయితే, ఈ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ను కావాలనే హెలికాప్టర్ పెయింటింగ్‌తో ఇరాన్ బురిడీ కొట్టించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా యుద్ధ సమయంలో తమ సైనిక, యుద్ధ సామగ్రిని రక్షించుకునేందుకు పలు దేశాలు నకిలీ లక్ష్యాలు (డెకాయ్స్)తో శత్రు దేశాలను తప్పుదోవ పట్టిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునేందుకు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఉంటుందని అంటున్నారు.

 

అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ మద్దతుదారులు ఖండిస్తున్నారు. క్షిపణులతో దాడి చేసే సమయంలో కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా థర్మల్ సిగ్నేచర్ (వేడిని గుర్తించడం ) ఆధారంగా పనిచేస్తాయని.. కాబట్టి అది పెయింటింగ్ అయ్యే అవకాశం లేదని వాదిస్తున్నారు. దాడి తర్వాత అక్కడ పొగ కదలికలు కూడా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ ఘటనపై ఇజ్రాయెల్ మాత్రం అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.