Tollywood Actor | పరాగ్ త్యాగి అనే పేరు వినగానే వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ, అతడి ముఖాన్ని చూసిన వెంటనే మాత్రం చాలా మంది సినీ అభిమానులు గుర్తుపడతారు. హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, వెంకటేష్–నాగ చైతన్య వెంకీ మామ, బాలకృష్ణ రూలర్ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. హిందీలోనూ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు సంపాదించాడు.
అయితే ఇటీవల పరాగ్ త్యాగి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని భార్య, ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (41) అకస్మాత్తుగా కన్నుమూసింది. ‘కాంటా లాగా’ పాటతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన షెఫాలీ మరణం సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఆమె మరణం తర్వాత యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కారణమనే ప్రచారం, అనేక రకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే వైద్యుల నివేదికలో మాత్రం ఆమె గుండెపోటుతోనే మరణించిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరాగ్ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.
తన భార్య మరణంపై ఇప్పటికీ తాను పూర్తిగా కోలుకోలేకపోతున్నానని చెప్పిన పరాగ్, కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేశాడు. “దేవుడు ఉన్న చోట దెయ్యం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో కొందరు తమ బాధల కంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. నా భార్య విషయంలో ఏదో తప్పు జరిగిందని నాకు అనిపిస్తుంది. నా భార్య పై ఎవరు చేతబడి చేశారు. ఎవరు చేశారో నాకు తెలిసినా, నేను బయట చెప్పలేను. ఒకసారి కాదు, రెండుసార్లు మా జీవితంలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మొదటిసారి తప్పించుకున్నాం. రెండోసారి అది చాలా తీవ్రమైంది. నిజంగా ఏమి జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు” అంటూ పరాగ్ భావోద్వేగంగా మాట్లాడాడు.
షెఫాలీ జరీవాలా గత ఏడాది జూన్ 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణం తర్వాత పరాగ్ పూర్తిగా కుంగిపోయాడని అతడికి దగ్గరైన వారు చెబుతున్నారు. తన భార్యను మర్చిపోలేకపోతున్నానని పలుమార్లు చెప్పిన పరాగ్, ఆమె జ్ఞాపకంగా తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పెద్ద టాటూగా వేయించుకోవడం కూడా అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ప్రస్తుతం పరాగ్ త్యాగి వ్యక్తిగత బాధతో పాటు తన వ్యాఖ్యల కారణంగా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.
