విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో చేతబడి కలకలం సృష్టించింది. గ్రామంలోని పొలాలకు వెళ్లే దారిలో మూడు రోడ్ల కూడలిలో చేతబడి చేసిన ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు. స్థానిక నాయకులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో చేతబడి చేశారన్న విషయం వెలుగుచూసింది. గ్రామ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్ చౌదరి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువకులు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించి తనకు సమాచారం ఇచ్చారన్నారు.
సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, అక్కడ మద్యం తాగి క్షుద్ర పూజలు చేసినట్లు తెలియవచ్చిందని చెప్పారు. గ్రామాల్లో మూఢనమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ, విజ్ఞాన వేదికలు ఏర్పాటు చేసి ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు