Renu Desai | నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ చాలా కాలంగా వెజిటేరియన్‌గా జీవిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆమె వీగన్ లైఫ్ స్టైల్‌ను కూడా అనుసరిస్తున్నారు. అయితే తాను నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్న అసలు కారణం ఏమిటో తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. రేణూ దేశాయ్ చిన్నప్పటి ఓ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. తనకు ఏడేళ్ల వయసులో గుడి వద్ద ఒక మేక పిల్లను బలి ఇస్తున్న ఘటన చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ దృశ్యం అప్పటినుంచి ఇప్పటివరకు తన కళ్లముందే మెదులుతూనే ఉందని, అదే క్షణంలో నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.
కుటుంబ నేపథ్యం ఇలా…
రేణూ దేశాయ్ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇంట్లో ఎలాంటి ఆహార నియమాలు బలవంతంగా పెట్టలేదని తెలిపారు. తన తండ్రికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని, తల్లి మాత్రం ప్యూర్ వెజిటేరియన్ అని పేర్కొంది. ఇంట్లో చికెన్, మటన్ వంటివి కూడా వండేవారని వెల్లడించారు. అయితే తన తల్లి ఎంత కఠిన వెజిటేరియన్ అయినా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, “ఇది తినాలి – అది తినకూడదు” అంటూ షరతులు పెట్టలేదని చెప్పారు.
“నా రుచుల కోసం ప్రాణిని కష్టపెట్టకూడదు”
ఆ సంఘటన తర్వాత జంతువుల బాధ తనకు అర్థమైందని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. నా రుచుల కోసం ఏ ప్రాణిని కష్టపెట్టకూడదనే నిర్ణయంతో నాన్ వెజ్ పూర్తిగా మానేశాను. ఆ రోజు చూసిన దృశ్యం ఇప్పటికీ నా మనసులో ఉంది” అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.
జంతు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
ఇటీవల పెట్స్ విషయంలో రేణూ దేశాయ్ చురుకైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీధి కుక్కల్ని అన్యాయంగా చంపడంపై ఆమె గళమెత్తారు. అవసరమైతే తమను సంప్రదించవచ్చని, వాటి బాధ్యతను తామే తీసుకుంటామని కూడా ప్రకటించారు. జంతువుల పట్ల ప్రేమ, కరుణ తన జీవన విధానంలో భాగమైపోయిందని రేణూ దేశాయ్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
