Site icon vidhaatha

Employees New health scheme । తెలంగాణ ఉద్యోగులకు ఊరట.. కొత్త ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం ప్రతిపాదనలు రూపొందించిన ఉద్యోగ జేఏసీ

Employee health scheme । తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధార‌ప‌డిన కుటుంబీకుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ (EHS)ను అమ‌లు చేయాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (JAC of Telangana Employees) కోరింది. ఈ మేర‌కు వివిధ ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చలు జ‌రిపి నూత‌న ఈహెచ్ఎస్ విధానం అమ‌లు కోసం ఒక ముసాయిదా(draft)ను రూపొందించి  ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాద‌న‌ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ ల‌చ్చిరెడ్డి, పలువురు జేఏసీ నాయకులు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌నర్సింహ(Damodar Rajanarsimha)కు  బుధవారం అంద‌జేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ స్కీంలో లోటు పాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలు(benefits of the newly proposed health scheme), తద్వారా  ప్రభుత్వానికి వచ్చే పేరు గురించి మంత్రికి ఈ సందర్భంగా లచ్చిరెడ్డి (Lacchi Reddy) వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం  పడకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన  317 జీవోతో ఉద్యోగులు పడుతున్న కష్టనష్టాల గురించి కూడా మంత్రికి లచ్చిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. వెంటనే జీవో 317ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న విధానం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులకు న‌గ‌దు ర‌హిత వైద్య చికిత్స (cashless medical treatment) అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ (Employees Health Scheme) (ఈహెచ్ఎస్‌)ను ప్రారంభించాల‌ని అనుకుంది. అప్పటివ‌ర‌కు ఉన్న మెడిక‌ల్ రీయింబర్స్‌మెంట్‌ (reimbursement system) విధానానికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉద్దేశించింది. ఇందుకు ఉద్యోగుల నుంచి నెల‌కు రూ.90, రూ.120 చొప్పున కంట్రిబ్యూష‌న్‌గా తీసుకోవాల‌ని నిర్ణయించింది. కానీ, ఈ విధానం అమ‌లులోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత ఉద్యోగుల నుంచి ఎలాంటి కంట్రిబ్యూష‌న్ లేకుండానే న‌గ‌దుర‌హిత వైద్య సేవ‌లు అందించేలా ఈహెచ్ఎస్ అమ‌లు చేసేలా రెండుసార్లు జీవోలు వ‌చ్చిన‌ప్పటికీ అమ‌లుకు నోచుకోలేదు. దీంతో ఇప్పటికీ మెడిక‌ల్ రీయింబర్స్‌మెంట్‌ (reimbursement system) విధాన‌మే కొన‌సాగుతున్నది.

ప్రస్తుతం ఉన్న విధానంతో స‌మ‌స్యలు

ప్రస్తుత మెడిక‌ల్ రీయింబర్స్‌మెంట్‌ విధానం వ‌ల్ల ఆప‌ద స‌మ‌యంలో ఉద్యోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు తీవ్ర ఇబ్బందులు (severe difficulties) ఎదుర్కొంటున్నారు. అత్యవ‌స‌ర స‌మ‌యంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్న రిఫ‌రెల్ హాస్పిట‌ల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా హస్పిటళ్లలో డబ్బు కట్టాల్సి వచ్చేది. అందుబాటులో సొమ్ము లేనివాళ్లు అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక‌వేళ ఇంటికి పెద్ద అయిన ఉద్యోగే ఆసుప‌త్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు స‌ర్దుబాటు చేసేందుకు కుటుంబ‌స‌భ్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పైగా రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని రూ.2 ల‌క్షల‌కే ప‌రిమితం (ceiling) చేశారు. చికిత్సకు అంత‌కంటే ఎక్కువ ఖ‌ర్చు అయితే రిలాక్సేష‌న్ పొందేందుకు స్టాండింగ్ క‌మిటీ(Standing Committee)ని ఆశ్రయించాల్సి వ‌స్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుప‌త్రుల్లో ఖ‌ర్చు చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ డ‌బ్బుల‌ను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు (రీయింబర్స్‌మెంట్‌) ఏడాది నుంచి రెండేళ్ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతున్నది. అప్పటివ‌రకు ఉద్యోగులపై వ‌డ్డీ భారం త‌ప్పడం లేదు.

పీఆర్సీ 2018లో చేసిన సిఫార్సు

మెడిక‌ల్ రీయింబర్స్‌మెంట్‌ విధానంలో ఈ ఇబ్బందుల నేప‌థ్యంలో ఈహెచ్ఎస్ అమ‌లు కోసం 2018 పీఆర్సీ (PRC) ఒక ప్రతిపాద‌న చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల, పెన్షనర్ల బేసిక్ పే నుంచి ఒక శాతాన్ని వ‌సూలు చేయాల‌ని సూచించింది. అయితే, కొన్ని ఉద్యోగ సంఘాలు, కొంద‌రు ఉద్యోగులు ఈ ప్రతిపాద‌న‌ను వ్యతిరేకించారు. అధిక వేత‌నం ఉన్న వారి నుంచి 1 శాతం వ‌సూలు చేయ‌డం చాలా ఎక్కువ అని కొంద‌రు అన్నారు. కుటుంబ‌స‌భ్యుల సంఖ్యను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అద‌న‌పు వైద్య సేవ‌లు, స‌దుపాయాలు ఉండాల‌ని ఇంకొంద‌రు తెలిపారు.

తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రతిపాద‌న‌

ఈ అన్ని అంశాల‌తోపాటు ఉద్యోగులు (employees), పెన్షనర్లు(pensioners), వారి కుటుంబ‌స‌భ్యులు (family members) ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్‌) కోసం తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఒక కొత్త విధానానికి (a new policy for the Employees Health Scheme) రూప‌క‌ల్పన చేసింది. ప‌లు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల‌తో చ‌ర్చించి దీనిని రూపొందించి ప్రభుత్వానికి అంద‌జేసింది.

ఈ కార్యక్రమంలో TGE JAC నాయకులు డా.నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్,  తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version