HiLITE Group | సాధారణంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు (employees) బహుమతులు (gifts) ఇస్తుండటం చూస్తుంటాం. పండగలు, కంపెనీ యానివర్సరీ.. ఇలా ప్రత్యేక సందర్భాల్లో సంస్థలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి చిన్నచిన్న గిఫ్ట్స్ ఇస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటాయి. స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, షాపింగ్ కూపన్స్, బోనస్‌లు ఇస్తుంటాయి. అయతే, ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీలు.. సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు లగ్జరీ బహుమతులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
రూ.20 కోట్ల విలువైన కార్లు..
ఇప్పటికే చెన్నై, హర్యానాకు చెందని కొన్ని సంస్థలు ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ దీపావళి, వార్షికోత్సవ కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేరళకు చెందిన ఓ సంస్థ కూడా తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ చేసింది. కోజికోడ్‌కు (Kozhikode) చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ HiLITE గ్రూప్ (HiLITE Group) తన 30 ఏళ్ల వార్షికోత్సవ వేడుకలను (HiLITE Group 30th anniversary celebrations) ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ 30 ఏళ్లలో సంస్థ ఎదుగుదలకు కృషి చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 47 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లను బహుమతిగా అందించింది. రూ.20 కోట్ల విలువైన 47 లగ్జరీ కార్లను ఉద్యోగులకు గిఫ్ట్‌గా ఇచ్చింది.
డిఫెండర్, ఆడీ, బెంజ్..
వాటిలో డిఫెండర్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, ఆడీ Q8, బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, స్కోడా వంటి హైఎండ్ మోడల్ ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటితోపాటూ టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి మోడల్స్‌ను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘హై-లైట్ (Hi-LITE) గ్రూప్’ తమ ఉద్యోగుల పట్ల చూపిన ఉదారత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని ఈ విధంగా గౌరవించిన సంస్థ చైర్మన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి గౌరవించే ఇలాంటి సంస్థలు ఇతర కంపెనీలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
Wedding | మరికాసేపట్లో పెళ్లి.. అక్కడే అసలు ట్విస్ట్.. వరుడు అసలు అబ్బాయే కాదు..
