అమరావతి, విధాత :
దేశంలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు బాగున్నాయని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కొన్నేళ్లుగా పాత చట్టాలపై అధ్యయనం చేసి నాలుగు కోడ్‌లుగా విభజించి రూపొందించారని ఆయన కొనియాడారు. సామాజిక భద్రత కోడ్-2020లో తొమ్మిది సామాజిక భద్రత చట్టాలను ఏకీకరించారన్నారు. అసంఘటిత రంగం, గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్‌లకు మొదటిసారిగా సామాజిక భద్రతా ప్రయోజనాలు కలిగాయన్నారు. ఇందుకోసం నేషనల్ అండ్ స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డులతో పాటు సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేస్తారన్నారు. ఈపీఎఫ్ నిబంధనలు అన్ని రంగాల సంస్థలకు వర్తింపచేయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
ఈఎస్ఐసీ ప్రయోజనాల విస్తరణ చేయడమే కాకుండా, ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో ప్రమాదం జరిగితే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయన్నారు. మహిళలకు 26 వారాల మాతృత్వ సెలవులు ఇవ్వడమే కాకుండా పనిచేసే ప్రాంతాల్లో శిశు సంరక్షణ విరామాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. పారిశ్రామిక వివాదాల కోడ్-2020 లో ఒక యూనిట్ లేదా కంపెనీలో పనిచేసే కార్మికులలో 51 శాతం సభ్యత్వం ఉన్న ట్రేడ్ యూనియన్లకే ఇక నుంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ లో శాశ్వత ఉద్యోగుల ప్రయోజనాలు సమానంగా ఉంటాయన్నారు. వర్కర్ రీ-స్కిల్లింగ్ ఫండ్ లో భాగంగా ఉద్యోగం కోల్పోయిన వారికి 15 రోజుల వేతనం ఇస్తారన్నారు. మూడు వందలకు పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఉద్యోగాల తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేశారని, ఆషామాషీగా తొలగించడం కుదరదన్నారు.
‘చాలావరకు అపరాధాలకు రాజీమార్గం లేదా ఫైన్ విధించటం ద్వారా ముగింపు పలకనున్నారు. వేతనాల కోడ్-2019 కింద ఏ ఒక్క ఉద్యోగి లేదా కార్మికుడికి కనీస వేతనం కంటే తక్కువ చెల్లించకూడదు. ఓవర్ టైమ్కు రెట్టింపు వేతనం తప్పనిసరి చేశారు. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వాలని, ఎలాంటి వివక్షకు తావు లేదు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020 ప్రకారం ప్రతి ఉద్యోగికి వార్షిక హెల్త్ చెకప్ చేయడమే కాకుండా అపాయింట్‌మెంట్ లెటర్ తప్పనిసరి చేశారు. పెద్ద సంస్థల్లో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వలస కార్మికులకు ప్రయాణ అలవెన్స్ తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చౌక దుకాణాల్లో సరకులు తీసుకునేందుకు రేషన్ కార్డుల పోర్టబిలిటీ కల్పించాలి. డిజిటల్ మీడియా, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా రక్షణ పరిధిలోకి తీసుకువచ్చారు. మహిళలు రాత్రి పూట పని చేయడానికి భద్రతా నిబంధనలతో అనుమతించారు. 50 కి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో శిశు సంరక్షణ కేంద్రం తప్పనిసరి చేశారు. వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్, వివాదాల కోడ్ లుగా నాలుగు కోడ్ లు తెచ్చారు’ అని మంత్రి ఆయన వివరించారు.
ప్రతి ఉద్యోగి లేదా కార్మికుడి కుటుంబంలో తండ్రి, తల్లి, భార్య పిల్లలతో పాటూ అత్తమామలుకు కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఫ్యాక్టరీ నుండి ఇంటికి వెళ్ళే లోపు ఏం జరిగినా ఈఎస్ఐ వర్తిస్తుందన్నారు. గర్భిణీ స్త్రీలకు వర్క్ ఫ్రం హోం, అలాగే 26 వారాల సెలవు సౌకర్యం ఉంటుందన్నారు. అసంఘటిత కార్మికులకు రక్షణ కోసం బోర్డు ద్వారా అన్ని పథకాలు అందేలా భరోసా ఇచ్చేలా విధానం తెచ్చారని కొనియాడారు. డిజిటల్ మీడియా వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ లభిస్తుందన్నారు. మహిళలతో పని చేయించే యాజమాన్యాలు వారిని పని తరువాత ఇండ్లవద్దకు చేర్చేలా సంస్కరణలు తెస్తున్నామన్నారు. కార్మికుడి ఇష్ట ప్రకారం 10 గంటలు, కుదరకపోతే 8 గంటలు పని చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. కార్మికుడు బలపడితే దేశం బలపడుతుందని, వారి గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
