Chandrababu : భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకే

భూ రికార్డులు ట్యాంపర్ చేస్తే జైలుకే పంపిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రైతుల భూములకు భద్రత కల్పించేందుకే ‘మీ భూమి–మీ హక్కు’ పాస్ పుస్తకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

అమరావతి:  భూరికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకే అని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భూరికార్డులు ఎవరూ కూడా ట్యాంపర్ చేయకుండా భద్రతా ఫీచర్లు తీసుకువచ్చాం అని, ఎవరైనా తారుమారు చేసే ప్రయత్నం చేస్తే వారిని జైలుకు పంపేలా నిబంధనలు పెట్టాంఅని స్పష్టం చేశారు. జీవితంలో ఎవడూ రైతుల భూములపై కన్నేయకుండా భద్రతా విధానాలతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నాంఅని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగట్లలో మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మీ భూమి- మీ హక్కు ద్వారా రాజముద్రతో కూడిన భూ యాజమాన్య పత్రాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
భూ వివాదాలకు కారణమైన గత వైసీపీ పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి పారేశాం అని,  ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం అని, గతంలో భూమి కాజేయాలంటే 22ఏ కింద పెట్టేసి దానిని తీసేసుకునేవారు అని, ఇప్పుడు భూ రికార్డులను ట్యాంపర్ చేయకుండా భద్రతా ఫీచర్లు తీసుకువచ్చాం అన్నారు. పటిష్టంగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లకుండా పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నాం అని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం  ప్రతీనెలా 9 తేదీన ఇలాంటి  కార్యక్రమం చేపట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం అన్నారు. నయాపైసా లంచం లేకుండా ఈ పాస్ పుస్తకాలను జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని, ఈ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను నిరంతరం  పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు.

2027డిసెంబర్ నాటికి రైతులు అందరికి పాస్ పుస్తకాలు

ఈ నెలలో 279 గ్రామాల్లో సర్వే చేసి 1.16 లక్షల మందికి పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం అని, 18 లక్షల పాస్ పుస్తకాలను ఏప్రిల్ నెలలోగా జారీ చేయాలని ప్రయత్నిస్తున్నాం అని, ఇప్పటి వరకూ 37.40 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. వీటితో పాటు 9500 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది. 62 లక్షల పాస్ పుస్తకాలు ఇంకా జారీ చేయాల్సి ఉంటుంది
ఆ ప్రక్రియ పూర్తి అయితే వందశాతం పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్టేనన్నారు. ఎక్కడా తప్పులు లేని భూమి రికార్డులు తయారు చేయటమే  లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టాం అన్నారు. 2027 డిసెంబరు వరకూ ప్రతీ ఒక్కరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని, వారసత్వంగా వచ్చిన భూమిని కేవలం వంద రూపాయలతో మ్యూటేషన్ చేసుకునేలా చర్యలు తీసుకున్నాం అన్నారు.ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుంది. క్యూఆర్‌ కోడ్‌తో మీ ఫోన్‌లోనే మీరు చూసుకోవచ్చు. మీ రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రంగా ఉంటాయి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. భూమి అంటే మనకు నమ్మకం, విశ్వాసం, అమ్మతో సమానం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరు అని స్పష్టం చేశారు.

రైతుల భూమిపై జగన్ ఫోటో ఎందుకో ?

తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై ఫోటోలు వేసుకోవడానికి జగన్ ఎవరు? అని, అందుకే రాజముద్రతో, విశిష్టభద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. తప్పుడు విధానాల ద్వారా మీ భూములన్నీ కాజేసే ప్రయత్నం చేశారు అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా వివాదాలు ఉన్న భూములపై పెత్తనం చేయడానికి సొంత మనుషుల్ని ఏర్పాటు చేశారు అన్నారు. పులివెందుల నుంచి తెచ్చుకున్న మనుషులతో మీ పొలాలను, స్థలాలను కాజేసే ప్రయత్నం చేశారు అని చంద్రబాబు ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపైనా, సరిహద్దు రాళ్లపైనా, పిల్లల స్కూలు బ్యాగులు, పుస్తకాలపైనా ఆయన ఫోటోలు వేసుకున్నారు అని, రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకోడానికి ఖర్చు పెట్టిన వ్యక్తి అత్యంత దుర్మార్గం చేశాడని మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీల్లో 80 శాతం భూవివాదాలకు సంబంధించినవేనన్నారు. ప్రతీ ఊర్లోనూ ఉండే ఆ పార్టీ రౌడీలు మీ భూమిని తక్కువధరకు ఇస్తే సరేసరి లేకపోతే 22ఏలో పెట్టేశారు అని, ఈ రకంగా లక్షల ఎకరాలను కాజేశారు అని చంద్రబాబు ఆరోపించారు.

హెలిప్యాడ్ కోసం రైతు భూమి స్వాహా

తాడేపల్లి వద్ద జగన్ ఇంటిని కట్టుకున్నాడని, అక్కడే హెలిపాడ్ వేసుకోవాల్సి వస్తే 10 ఎకరాలను బలవంతంగా కాజేశారు అని, 70 ఏళ్ల నుంచి అనుభవంలో ఉన్న భూమిని 22 ఏలో పెట్టేసి వివాదం చేసేశారు అని చంద్రబాబు ఆరోపించారు. 1956 నుంచి రికార్డులు ఉన్న భూమిని కాజేయడానికి 22ఏలో పెట్టి కాజేసిన వ్యవహారం అంతా ఇప్పుడు వెలుగు చూసింది అని తెలిపారు. కేవలం హెలిపాడ్ నిర్మాణం కోసం ప్రైవేటు భూమిని దొంగతనంగా గవర్నమెంటు భూమిగా మార్చేసి ఆయన అనుభవించాడు అన్నారు.
రాజకీయ కక్షలతో ఇష్టాను సారంగా పాలన అస్తవ్యస్తం చేశారని, 2019-24 మధ్య పాలన చక్కగా చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.

భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోను

ప్రజలు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన అప్పుల్ని చెల్లించడానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది అన్నారు. ప్రజలు పన్నులు కట్టిన డబ్బులను గత పాలకుడు దుర్వినియోగం చేశాడు అని చంద్రబాబు విమర్శించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరిచ్చి, శ్రీశైలం నీటిని రాయలసీమ ప్రాంతానికి మళ్లిస్తున్నాం అని, అంతటి దూరదృష్టి చేయకపోతే రాయలసీమకు నీరు వచ్చేది కాదు అన్నారు. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ కు కూడా నీరిచ్చాం అని తెలిపారు. పశ్చిమ కర్నూలుకు కూడా నీరిచ్చి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరిచ్చే లక్ష్యాన్ని చేరుకుంటాం అన్నారు. రైతుకు లాభాలు ఇచ్చే సాగు జరగాలి. దానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగిస్తాం అని, ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ తో కలిసి కూటమిగా ప్రజల ముందుకు వచ్చాం. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ చేశాం అని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నాం అని, పోలవరం, అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అని తెలిపారు.

నేను రాయలసీమ బిడ్డనే

మాజీ సీఎం జగన్ మాటిమాటికి రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటాడని, కాని రాయలసీమకు చేసిందేమి లేదని చంద్రబాబు విమర్శించారు. నేను రాయలసీమ బిడ్డను అని, ఎన్టీఆర్ కూడా ఈ ప్రాంతపు ముద్దుబిడ్డే అని చంద్రబాబు గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగు కోసం రూ.72 వేల కోట్లు ఖర్చు చేస్తే గత పాలకుడు కేవలం రూ.2 వేల కోట్లతో సరిపెట్టాడు అని, పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడు అని, డయాఫ్రామ్ వాల్ ను కొట్టుకుపోయేలా చేసి రూ.400 కోట్లు దుర్వినియోగం చేశాడు అని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అదనంగా రూ.1000 కోట్లతో డయాఫ్రామ్ వాల్ ను నిర్మిస్తున్నాం అని తెలిపారు.
గతంలో కరవుతో కటకటలాడిన రాయలసీమను ఇప్పుడు ఉద్యాన హబ్ గా మారుస్తున్నాం అని, ప్రతీ ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు రాయలసీమ నుంచి వస్తున్నాయని, డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ రకాలుగా ఈ ప్రాంతానికి నీరిచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నీళ్లుంటే పంటలు పండటమే కాదు పరిశ్రమలూ వస్తాయని,
నదులు అనుసంధానం జరగాలి. రాయలసీమ సహా రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరిస్తాం అన్నారు.

ప్రాజెక్టుల పేరుతో రాజకీయ డ్రామాలు

మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారు అని చంద్రబాబు విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేవని ఎన్జీటీ దానిని నిలిపేసింది. అయినా ఇప్పుడు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారు అన్నారు. వెస్ట్ కర్నూలులో వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తుంగభద్ర డ్యామ్ నుంచి ఎక్కువ నీళ్లు కర్నూలు వినియోగించుకునేలా చూస్తాం అన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును, రాజోలిబండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తాం అని తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు మూడు రాష్ట్రాల మధ్య సమస్య ఉంది. దీనిపై పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు చేసి సమస్య లేకుండా చేస్తాం అన్నారు. రాయలసీమలో 120 ప్రాజెక్టులను 2019కు ముందు మేం మంజూరు చేస్తే గత పాలకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్నారు.

కల్తీ ప్రసాదంలో తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర

కల్తీ ప్రసాదంతో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు అని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయించారు అని, బాత్రూంలను శుభ్రపరిచేందుకు వినియోగించే రసాయనాలతో ఆ నెయ్యి తయారు చేయించి లడ్డూల్లో వాడారు అన్నారు. నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు..కానీ వాళ్ల బాబాయి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పారు అని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించింది అని తెలిపారు.  శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారు.  కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేస్తే దానిని సరిదిద్దే ప్రయత్నం చేశాను అన్నారు. గతంలో లడ్డూకి, ఇప్పుడు అందించే లడ్డూకు చాలా వ్యత్యాసం ఉంది అన్నారు.

పరామర్శల పేరుతో బల ప్రదర్శన రాజకీయం

పరామర్శల పేరుతో జగన్ రాజకీయ బలప్రదర్శనలు చేస్తున్నాడని, గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు పట్టేలా వ్యవహరించారు అని చంద్రబాబు విమర్శించారు. మరే వాహనాలు వెళ్లకుండా వాహనదారులను ఇబ్బందులు పెట్టారు అని, గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించేశారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కిందపడేసి తొక్కించేసి రౌడీయిజం చేశారు అన్నారు. బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి అని, ప్రజా సమస్యల కోసం పోరాడకుండా రాజకీయం కోసమే బలప్రదర్శన చేస్తున్నారు అని, ఈ తరహా రాజకీయాన్ని ఎదుర్కోవటం నాకు తెలుసు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Trisha-Nayan | త్రిష – నయనతార కోల్డ్ వార్ ముగిసిందా .. వారి ఆస్తులు గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..!
Covid Vaccines : కొవిడ్ వ్యాక్సిన్ల‌ వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌రా..? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?

Latest News