AndhraPradesh |
ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి వెనుక కారణమేంటి? కేంద్రమంత్రులు అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందు ఉంచిన ప్రతిపాదనలేంటి? వారి మధ్య ఆ రోజు ఏం చర్చలు నడిచాయి? ఇప్పటి వరకూ మీడియాలో దానిపై సరైన సమాచారం రాలేదు. ఆ టాప్ సీక్రెట్‌ను విధాత బ్రేక్ చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను విశ్వసనీయ వర్గాల నుంచి రాబట్టింది! ఆ ప్లాన్ ఆషామాషీ ప్లాన్ కాదు! ఎన్నికల ప్రక్రియను సాగదీసేలా.. ఐదు వీలైతే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం.. తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుకు ఆర్థిక వనరులను పూర్తిగా కట్టడి చేయడం! ఈ ప్లాన్ గురించి తన విశ్వసనీయ శ్రేణుల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు.. ఆఘమేఘాలపై ఢిల్లీ ప్రయాణం కట్టి.. బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తున్నది.
(విధాత ప్రత్యేకం)
రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నదన్న అనుమానాలు! టీడీపీ రోజు రోజుకూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్నదన్న సమాచారం! వెరసి.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారని తెలుస్తున్నది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లడం వెనుక ఆయనకు అందిన ఈ ప్లాన్ కారణమని అంటున్నారు. విశ్వసనీయవర్గాలు చెబుతున్న ప్రకారం.. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లేదా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థిక వనరులు అందకుండా అష్టదిగ్బంధనం చేసిన పద్ధతుల్లోనే.. ఈసారి కూడా ఇప్పటికే సమకూర్చుకున్న నిధులు క్షేత్రస్థాయికి చేరకుండా ప్రణాళికలు రూపొందించారని తెలుస్తున్నది. పోలింగ్ విషయంలో 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పద్ధతిని ఇక్కడ కూడా అనుసరించేలా చూడాలన్నది జగన్ ప్లాన్‌గా చెబుతున్నారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన మమతాబెనర్జీని ఎలాగైనా ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఆ రాష్ట్రంలో 8 దశల్లో పోలింగ్ నిర్వహించేలా బీజేపీ ఏర్పాట్లు చేసిందన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి.
ఒక రాష్ట్ర అసెంబ్లీకి సాధారణ పరిస్థితుల్లో ఇన్ని దశల్లో పోలింగ్ నిర్వహించడం అదే ప్రథమమేమో! 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమబెంగాల్‌లో ఒక్కదో దశలో సగటున 30 నుంచి 35 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. అయితే.. బీజేపీ వ్యూహం ఆనాడు ఫలించలేదు. పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరంలో మమతదే పై చేయి అయింది. కానీ.. బీజేపీ తన సీట్లను గణనీయంగా పెంచుకోగలిగింది.
ఇదే ఫార్ములా రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు పనికి వస్తుందని జగన్ అంచనా అయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నిజంగానే తనకు ఇబ్బంది కలిగిస్తుందనే ఆలోచనతోనే చంద్రబాబు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ పెద్దలను కలిశారని తెలుస్తున్నది. తమ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ దశలో సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియ సాగితే దాన్నుంచి వైసీపీ లబ్ధిపొందే అవకాశం ఉన్నదని బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు మొరపెట్టుకున్నట్టు సమాచారం.
బీజేపీ డబుల్ గేమ్
బీజేపీ కూడా ఏపీ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. తనపై ఉన్న కేసుల విషయంలో భయపడుతున్న జగన్.. కేంద్రంపై పల్లెత్తు మాట కూడా అనడం లేదు. మరోవైపు టీడీపీ సైతం బీజేపీ పట్ల సానుకూల భావనతోనే ఉన్నది.
బీజేపీ వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నా.. ఆ వాసనలేవీ చంద్రబాబు అంటించుకునేందుకు ఇష్టపడటం లేదని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇదే బీజేపీకి సావకాశంగా దొరికింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని అర్థమైన బీజేపీ.. రాబోయే రోజుల్లో తనకు కష్టకాలం ఎదురైతే ఏపీ నుంచి గెలిచే 25 మంది ఎంపీల అవసరం ఉంటుందని భావిస్తున్నదని చెబుతున్నారు. అది టీడీపీ కావచ్చు.. వైసీపీ కావచ్చు. అందుకే ఇద్దరినీ దగ్గర పెట్టుకుని ఆడిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అగ్రనాయకత్వంలో కొంత మార్పు కనిపిస్తున్నది. అప్పటి వరకూ బీజేపీ ప్రభుత్వంగా ప్రచారం చేసుకున్న నేతలకు తమది ఎన్డీఏ ప్రభుత్వం అని గుర్తుకు వచ్చింది. అంతేకాకుండా.. మిత్రుల కోసం ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలోనే అటు జగన్‌ను కానీ, ఇటు చంద్రబాబును కానీ వదులుకోవద్దన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. చంద్రబాబునాయుడుకు వెంటనే అపాయింట్‌మెంట్ దొరకడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు.
గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి కాస్త కనికరిస్తే.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతగా అయితే.. రెండు విడతలకు పరిమితం చేయాలని, అంతేగానీ ఏడు విడతలు వద్దని విన్నవించారని సమాచారం. కొసమెరుపు ఏంటంటే.. అటు జగన్ ప్రతిపాదనలను, ఇటు చంద్రబాబు విన్నపాలను విన్న బీజేపీ పెద్దలు.. ఏ ఒక్కరికీ అభయం ఇవ్వలేదని తెలుస్తున్నది.
ఏయే రాష్ట్రాలలో ఎన్ని దశల్లో పోలింగ్!
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో ఎక్కువ దశల్లో ఎన్నికల నిర్వహించిన చరిత్ర ఉన్నది. 2019 ఎన్నికల్లో సైతం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ ఆరు దశల్లో ఓటు వేయగా, పశ్చిమ బెంగాల్ ఐదు
దశల్లో ఓటు వేసింది.
2019లో జమ్ముకశ్మీర్ ఐదు దశల్లో, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు నాలుగు దశల్లో పోలింగ్‌కు వెళ్లాయి. 2014లో జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు మూడు దశల్లో, ఒడిశాలో రెండు దశల్లో ఓటేశారు. కానీ ఏపీ, తెలంగాణలో ఇలా జరిగిన చరిత్ర లేదు. 294 అసెంబ్లీ సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం రెండు దశల్లోనే ఎన్నికలు జరిపిన చరిత్ర ఉంది. 2018లో తెలంగాణలో సైతం డిసెంబర్‌లో అసెంబ్లీకి, 2019 మేలో లోక్‌సభకు ఒక దశలోనే ఎన్నికలు జరిగాయి.
ఎక్కువ దశలు కోరుకునేది ఎందుకంటే!
అసెంబ్లీకి ఎక్కువ దశల్లో ఓటింగ్ నిర్వహించడం వల్ల అధికార పార్టీకి చాలా లాభాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో, ప్రత్యేకించి అధికార పార్టీ తన అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావించే ప్రాంతాల్లో మరింత కేంద్రీకరించేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రచారంతోపాటు రాజకీయ సర్దుబాట్లు, డబ్బు పంపిణీకి సమయం దొరుకుతుందని అంటున్నారు.
ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఈ తరహా వ్యూహాలను అనుసరించి బీజేపీ మునుపటికంటే సీట్లను పెంచుకోగలిగిందని, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ అనుసరించిన విధానం కూడా ఇదేనని పలువురు గుర్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడిచే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఆ రెండు పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. అక్కడ వైసీపీ విజయానికి ఏం చేయాలనే అంశంలో జగన్‌కు స్పష్టత ఉన్నదని పలువురు అంటున్నారు.
ఈ పరిస్థితిలో ఎక్కువ విడతలల్లో పోలింగ్ జరిగేలా చూస్తే.. పరిస్థితి తమ చేతిలోనే ఉంటుందనే ఆలోచన జగన్‌కు ఉండొచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు లేని సమీప నియోజకవర్గాల్లో జగన్ సహా పార్టీ నాయకత్వం మొత్తం తిష్ఠవేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్లాన్ అర్థమయ్యే చంద్రబాబు.. ఎక్కువ దశ పోలింగ్ వద్దని బీజేపీ పెద్దలను కోరేందుకే ఢిల్లీకి వెళ్లారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
2019లో టీడీపీకి ఆర్థిక దిగ్బంధం
2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికి ఏపీలో రగులుతున్న అంశంగా ఉన్న ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కారుతో కయ్యానికి కాలుదువ్వారు. జాతీయ స్థాయిలో మోడీ నియంతృత్వ విధానాలను గట్టిగా విమర్శించారు. అమరావతి రాజధానికి పైసా ఇవ్వకుండా నీరు-మట్టితో సరిపెట్టుకున్నారని మండిపడ్డారు.
మొన్నటిదాకా తమతోనే ఉన్న చంద్రబాబు.. ఒక్కసారి ప్లేటు ఫిరాయించడంతో ఆ ఎన్నికల్లో టీడీపీని టార్గెట్ చేశారని అంటుంటారు. దాని వల్లే టీడీపీకి నిధులు అందలేదని, టీడీపీకి నిధులు ఇవ్వకుండా కార్పొరేట్, పారిశ్రామిక వేత్తలకు తన సంస్థల ద్వారా ఫోన్లు చేయించి.. ఆపించారని ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఆ ఎన్నికల్లో టీడీపీ గట్టి దెబ్బతిన్నది. అధికారం కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా టీడీపీ బాస్ ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నారని తాజా పరిణామాలను గమనించి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.