Madhya Pradesh | ఓ వృద్ధుడు 62 ఏండ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. తన రెండో భార్య(36) ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. అయితే ముగ్గురు పిల్లల ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో నవజాత శిశువుల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని అతర్‌బేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా(62), కస్తుర్బా బాయి(60)తో కలిసి ఉంటున్నాడు. అయితే తమకు జన్మించిన ఒక్క కుమారుడు 11 ఏండ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించాడు.
కస్తుర్బా బాయి పిల్లలను కనే అవకాశం లేకపోవడంతో.. తన భర్త గోవింద్‌కు దగ్గరుండి ఆరేండ్ల క్రితం రెండో వివాహం జరిపించింది. రెండో భార్య హీరాబాయి కుష్వాహాకు పెళ్లైనప్పుడు 30 ఏండ్ల వయసు. అయితే ఆరేండ్ల తర్వాత హీరాబాయి ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది.
మంగళవారం తెల్లవారుజామున సాత్నా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో హీరాబాయికి వైద్యులు సీజెరియన్ ద్వారా డెలివరీ చేశారు. ముగ్గురు శిశువులు బలహీనంగా ఉండటంతో నవజాత శిశువుల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తమ ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని గోవింద్‌తో పాటు ఇద్దరు భార్యలు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.