Site icon vidhaatha

మునుగోడుపై TRS గురి: మండలానికో మంత్రి.. ఊరికో ఎమ్మెల్యే! 86 మందితో టీం రెడీ

విధాత: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తిన్న ఎదురుదెబ్బలు ఇంకా గుర్తుకు వస్తున్నాయేమో కేసీఆర్ ఈసారి మాత్రం గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది ఆయన పంతం.. దుబ్బాక లేదా హుజూరాబాద్ ఉప ఎన్నిక మాదిరి ఇక్కడా ఎదురుదెబ్బ తగిలితే జాతీయ స్థాయిలో పరువు పోతుందన్న భయం కేసీఆర్‌లో ఉంది. అందుకే ఈసారి పగడ్బందీగా సేనలను మోహరిస్తున్నారు.

మొత్తం రాజకీయ ఆర్ధిక వనరులన్ని అక్కడే కేంద్రీకృతం చేస్తున్నారు.. మండలానికో మంత్రి.. ఊరికో ఎమ్మెల్యే.. వీధికో ఎంపీపీ.. ఓటరుకో సర్పంచ్ అన్న తీరున కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మునుగోడు బాధ్యత హరీశ్‌రావుకు అప్పగించిన కేసీఆర్ మిగతా లీడర్లను కూడా భారీగానే మోహరిస్తున్నారు. కేటీఆర్‌ను సైతం మునుగోడు బాధ్యతల్లోకి దించారు.

దేశంలో కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 86 మంది ఎమ్మెల్యేలకు మునుగోడు బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. మునుగోడును 86 యూనిట్లుగా విభజించిన కేసీఆర్.. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జి ఉండేలా ప్లాన్ చేశారు. వారంతా తమకు కేటాయించిన గ్రామంలో పార్టీకి పని చేయాలి.

ఈ నేపథ్యంలో ఒక్కో ఎమ్మెల్యే 20 మంది అనుచరులు.. అంటే ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో కలిసి మునగోడులో తిష్టవేసి తమ పని ప్రారంభిస్తారు. దసరా అవ్వగానే వీరంతా ఓట్ల వేటలో పడతారు. మునుగోడు ఇంచార్జిగా హరీశ్‌ ఇంకా ఆయనకు సపోర్ట్ గా మంత్రి జగదీష్ రెడ్డి ఉంటారు. చూడాలి..ఇంత ఎక్కువమంది కలిసి టీఆర్ఎస్‌ను గెలిపిస్తారో.. మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్లుగా హుజూరాబాద్.. దుబ్బాక ఫలితాలను రిపీట్ చేస్తారో చూడాలి

Exit mobile version