Mulugu | నాగరిక సమాజంలోనూ కొంతమంది అనాగరికులుగా వ్యవహరిస్తున్నారు. వివాహేతర సంబంధం( Love Affair ) అనుమానంతో ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు అగ్నిపరీక్ష నిర్వహించారు. అగ్ని గుండంలో నుంచి చేతులతో గడ్డపార తీయాలని హుకుం జారీ చేశారు. చేతులకు గాయాలైతే రూ. 11 లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించారు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు మండలం( Mulugu ) బంజెరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్.. ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నట్లు గ్రామ పెద్దలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో 20 సార్లు పంచాయితీ నిర్వహించారు గ్రామ పెద్దలు. చివరకు గంగాధర్‌కు అగ్నిపరీక్ష పెట్టారు. అగ్నిలో ఉన్న కాలిన గడ్డపారను చేతులతో తీసి బయటపడేయాలన్నారు. ఒక వేళ గాయాలు కాకుంటే ఆ మహిళతో సంబంధం లేదని నమ్ముతామని, గాయాలైతే సంబంధం ఉన్నట్లుగా భావిస్తామన్నారు. చేతులకు గాయాలైతే జరిమానాగా రూ. 11 లక్షలు చెల్లించాలని పెద్దలు నిర్దేశించారు.
ఈ క్రమంలో గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు శిఖం ప్రదేశానికి వెళ్లి.. అక్కడ పిడకలతో అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఇక గంగాధర్ చెరువులో స్నానం చేసి వచ్చి తడి బట్టలతోనే అగ్నిలో ఉన్న గడ్డపారను బయటకు తీశాడు. తన చేతులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినప్పటికీ రూ. 11 లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేశారు. గ్రామ పెద్దల వేధింపుల నేపథ్యంలో గంగాధర్ ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.