Marriages | ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించడంపై ఓ వ్యక్తి దృష్టి సారించాడు. అందుకు భార్యలకు దూరమైన భర్తలతో పాటు అమాయక అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి.. భార్యలకు దూరమైన భర్తలకు వారితో రెండో వివాహం జరిపించి డబ్బులు దండుకుంటున్నాడు. ఈ వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్ భార్య 20 ఏండ్ల క్రితం మృతి చెందింది. లక్ష్మణ్‌కు నలుగురు పిల్లలు ఉండగా, వారిని చూసుకోవడం కష్టంగా మారింది. దీంతో రెండో వివాహాలు జరిపించే కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను లక్ష్మణ్ సంప్రదించాడు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతిని తీసుకొచ్చి లక్ష్మణ్‌తో వివాహం జరిపించాడు. లక్ష్మణ్ వద్ద రూ. లక్ష దండుకున్నాడు శివకుమార్. ఆ నగదులో కొంత యువతి కుటుంబానికి శివకుమార్ ముట్టజెప్పాడు. ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి.. మళ్లీ తిరిగి రాలేదు. శివకుమార్‌ను ఫోన్‌లో లక్ష్మణ్ సంప్రదించగా, ఆ అమ్మాయితో మాట్లాడించాడు. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ యువతి మాత్రం లక్ష్మణ్ వద్దకు రాలేదు.
మూడు నెలల క్రితం అదే అమ్మాయికి మరో పెళ్లి..
లక్ష్మణ్‌తో వివాహం జరిపించిన గిరిజన యువతికి మూడు నెలల క్రితం మరో పెళ్లి చేశాడు శివకుమార్. ఈ సారి జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి మోసపోయాడు. ఆయన వద్ద కొద్ది రోజుల పాటు ఉన్న యువతి.. తన పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయింది.
ముచ్చటగా మూడోసారి..
ఇక అదే గిరిజన యువతితో బోయినపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి వివాహం చేసేందుకు శివకుమార్ సిద్ధమయ్యాడు. సదరు గిరిజన యువతి తండ్రికి రూ.లక్ష ఇచ్చి మధ్యవర్తం చేసిన తాను రూ.లక్ష తీసుకొని పెళ్లి జరిపించేందుకు వేములవాడకు వచ్చాడు. విషయం తెలుసుకున్న లక్ష్మణ్, బంధువులు వేములవాడకు వచ్చి శివకుమార్‌ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.