కాళేశ్వరం ప్రాజెక్టులో రూ .3500 కోట్ల పనులు
వందల కోట్ల అక్రమార్జన ఆరోపణలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని అభియోగాలు
ఇరిగేషన్ శాఖలో కీలక నియామకాల్లో ప్రధాన పాత్ర
విధాత, హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించిన రోజునే అదే ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ శ్రీధర్ పై ఏసీబీ దాడులు నిర్వహించడం ఆసక్తిరేపింది. ఇరిగేషన్ సీఏడీ డివిజన్-8లో పని చేస్తున్న నూనె శ్రీధర్ చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో పని చేస్తున్నారు. తెలంగాణలో నూనె శ్రీధర్కు సంబంధించి 12 చోట్ల, మొత్తం 20చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో చేతివాటం
కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను నూనే శ్రీధర్ పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ .3500 కోట్ల పనుల ప్యాకేజీలు పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై ఏసీబీ రంగంలోకి దిగింది. ఇరిగేషన్ శాఖలో కీలక నియామకాల్లో కీలక పాత్ర వహించారని..ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్న ఆభియోగాలు ఆయనపై ఉన్నాయి. శ్రీధర్ ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో నాలుగు చోట్ల హైదరాబాద్‌లో ఆరు చోట్ల రైడ్స్ చేస్తున్నారు. . సోదాలలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.