విధాత, యాదగిరిగుట్టలో బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. ఆడ పిల్లలను దత్తత తీసుకుని…యుక్త వయసు వచ్చాక వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా ఎట్టకేలకు ఖాకీలకు చిక్కింది. యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే భక్తులే టార్గెట్‌గా ముఠా కొన్నాళ్లుగా ఈ నీచపు దందాకు పాల్పడింది.
ముఠా సూత్రదారి అనసూయతో పాటు పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో మహిళ కోసం గాలిస్తున్నారు. కాగా ముఠా లీడర్ అనసూయ చిత్రహింసలు తట్టుకోలేక బాధిత బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో సెక్స్ రాకెట్ బయట పడింది.
ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు పోలీసులు. గతంలో సైతం యాదగిరిగుట్ట వ్యభిచార ముఠా దందాలకు అడ్డాగా ఉండగా పోలీసులు యాదాద్రి ఆలయ అభివృద్ధి క్రమంలో వాటిని ఏరివేసే చర్యలను విజయవంతంగా నిర్వహించారు.
మానవ అక్రమ రవాణా ద్వారా బాలికలను తీసుకువచ్చి వారికి త్వరగా యుక్త వయసు వచ్చేలా ఆక్సిటోస్ ఇంజక్షన్లు ఇచ్చి మరి వ్యభిచార వృత్తిలోకి దించిన ఘటనలు ఆనాటి పోలీస్ దాడుల్లో వెలుగు చూశాయి. రాష్ట్ర హైకోర్టులో సైతం ఈ కేసులు విచారణకు వచ్చిన సందర్భాల్లో కోళ్ల ఫారాలలో బాయిలర్ కోళ్లకు మాదిరిగా బాలికలకు త్వరగా యుక్త వయసు వచ్చేలా ఆక్సిటోస్ ఇంజక్షన్లను ఇచ్చి మరి గుట్ట వ్యభిచార ముఠాలు సాగించిన దుర్మార్గాలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
కొంతకాలం గుట్టలో సద్దుమణిగిందనుకున్నా వ్యభిచార వృత్తి మళ్లీ వెలుగు చూడడం సంచలనం రేపింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దేశంలో ప్రఖ్యాతినొందిన యాదాద్రిలో వ్యభిచారం ముఠాల ఆటను కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.