Site icon vidhaatha

మళ్లీ ‘ముందస్తు’ ముచ్చట.. 24న అసెంబ్లీ రద్దు? సోషల్‌ మీడియాలో వైరల్‌!

ఉన్నమాట: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చ మళ్లీ మొదలైంది. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నాయి. ఇంకా చర్చకు రాని అంశాలు ఉంటే బీఏసీలో చర్చించి తదుపరి సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. కానీ 12నే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రెండు రోజులుగా వాట్సప్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది.

ఈ నెల 24న అసెంబ్లీ రద్దునకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ వార్త సారాంశం. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని, అతి పెద్ద పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలువనున్నదని అధికార పార్టీతో, పాటు బీజేపీ చేయించిన సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైందట.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు

సర్వేల శాస్త్రీయ సంగతి ఎలా ఉన్నా అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నది వాస్తవం. అలాగని ఆపార్టీని ప్రజలు ఏకపక్షంగా ఓడగొట్టేంత వ్యతిరేకత లేదు. ముఖ్యంగా మహిళలు, పింఛన్‌దారులు, రైతుల మెజారిటీ మద్దతు బీఆర్‌ఎస్‌కే ఉన్నదని సమాచారం. ఫలితంగా బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలువగలిగేవి స్థానాలు 30 వరకు ఉన్నాయట.

ఇంకో 10 నుంచి 15 సీట్లలో అధికార పార్టీ చాలా శ్రమిస్తేనే గెలుపు సాధ్యమని తాజా సర్వే నివేదిక ఒక ముఖ్యమంత్రికి అందించినట్టు రాజకీయ వర్గాలు చర్చించు కుంటున్నాయి. 25 స్థానాల్లో త్రిముఖ పోరు (బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ) హోరాహోరిగా ఉండనున్నదట. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ 25, బీజేపీ 10 స్థానాల్లో, ఎంఐఎం 7 చోట్ల గెలుస్తుందట.

BRSపై బీజేపీ అధిష్టాన వైఖరి ఏమిటి?

రిపబ్లిక్‌డే ఉత్సవాలు, గవర్నర్‌ ప్రసంగంపై రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగింది. చర్చలతో చివరికి కథ సుఖాంతమైంది. గవర్నర్‌ అధికార పార్టీ ఈ ఎనిమిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతిపై తన ప్రసంగం ద్వారా తెలిపారు. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వం గవర్నర్‌తో రాజీ పడిందనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టాన పెద్దలతోనూ సఖ్యతకు ఆ పార్టీ మొగ్గుచూపుతున్నదా? అంటే అవుననే అంటున్నారు. కానీ మోడీ-షా తెలంగాణలో తమదే అధికారం అన్న విశ్వాసంతో ఉన్నారట. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అధిష్టాన పెద్దల ఆలోచనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరకపోవడం కమలనాథులను ఆలోచనలో పడేసిందట. అందుకే పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆచితూచి అడుగులు వేయాలని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట.

సీఎం స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి

ముందస్తు ఎన్నికల ముచ్చట, ఒకవేళ జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనే చర్చ, అంచనాలు, సర్వేల అంకెలపై చర్చ జరుగుతున్నది. అందుకే దీనికంటే ముందు సీఎం కేసీఆర్‌ ఈ నెల 17వ తేదీని నూతన సచివాలయం ప్రారంభించిన తర్వాత చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Exit mobile version