– నిరుద్యోగులకు అన్యాయం
– యువతను నిర్వీర్యం చేసిన బీఆరెస్
– కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నిలబెట్టుకుంటాం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డదని, నిరుద్యోగులను విస్మరించిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ విమర్శించారు. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమ కలలు సాకారం చేసుకుందామంటే నిరాశే మిగిలిందన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ సభలో సోనియా గాంధీ చెప్పిన మాట నిలబెట్టుకొని రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో బాగుపడ్డది కేసిఆర్, వారి కుటుంబం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని చెదలు పట్టినట్టు పట్టి, మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రం నియంత పాలనలోకి చేరి, ప్రమాదపు టంచుల్లో ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందనిఅన్నారు.
తెలంగాణా ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్లే, ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని డాలీ శర్మ అన్నారు. మాహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు యావత్తు కోరుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని రావాలని రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి యాత్రను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి, వరంగల్ వెస్ట్ ఇంచార్జి సంజయ్ జాగిర్డార్, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్, డాక్టర్ పులి అనిల్ కుమార్, బంక సరళ యాదవ్ పాల్గొన్నారు.