Site icon vidhaatha

దేశంలో అసహనం పెరిగిపోయింది: వివాదంలో అమితాబ్‌ వ్యాఖ్యలు

అమితాబ్‌ మాటల స్ఫూర్తిని చూడకుండా విమర్శలెందుకు?
నిజం మాట్లాడితే నిందలా..!

విధాత: దేశ సాంస్కృతిక రాజధాని కలకత్తాలో 28వ కోలకతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. డిసెంబర్‌ 15నుంచి 22 వరకు సాగిన ఫిల్మోత్సవంలో జాతీయ, అంతర్జాతీయ సినిమాలెన్నో ప్రదర్శించారు. దేశంలోని ప్రముఖ తారలు, ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫిల్మోత్సవంలో అతిథులుగా పాల్గొన్న అమితాబ్‌ బచ్చన్‌ తన ప్రసంగం సందర్భంగా మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

వారం రోజులు సాగిన ఈ ఉత్సవంలో అమితాబ్‌ మాట్లాడుతూ.. కళాత్మక నిర్మాణమైన కోల్‌కతా నగరంలో అడుగుపెట్టి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందంటూ ఈ నగరం బహుళత్వానికీ, సమానత్వానికీ ప్రతీక అన్నారు. అలాగే, ప్రస్తుతం.. దేశంలో అసహనం పెరిగిపోయిందని వాపోయారు.

విభిన్న వర్గాల ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తున్నారని అలాంటి చర్యలు దేశ విచ్ఛీన్నానికి దారి తీస్తాయన్నారు. ఇంకా దేశంలో పౌరుల జీవనాన్ని నిర్దేశించే నైతిక పోలీసింగ్ పెరిగిపోయిందని ఇది దేశానికి మంచిది కాదన్నారు. మరో సందర్భంలో మాట్లాడుతూ.. ఆయన దేశంలో పౌరహక్కులు, స్వేచ్ఛల గురించి ప్రస్థావించారు.

అమితాబ్‌ మాట్లాడిన మాటలను ప్రధాన మీడియా వినీ విననట్లు నటిస్తున్నదన్న విమర్శలున్నాయి. ప్రస్తుత దేశ పరిస్థితిపై ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ఆలోచించదగినదిగా దేశ ప్రజలందరికీ చూపాల్సిన బాధ్యత మీడియాకున్నది. కానీ ప్రధాన మీడియా దీన్ని సౌకర్యంగా పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నది.

ఇదిలా ఉంటే.. కొందరు అమితాబ్‌ మాటలను దురుద్దేశ పూరితమైనవిగా విమర్శిస్తున్నారు. లేనివి ఉన్నట్లు చెసి చెప్పటంగా దూషిస్తున్నారు. ఒక వర్గ రాజకీయ అభిప్రాయాలకు వత్తాసు పలుకటంగా ఆగ్రహిస్తున్నారు. ఇలా గతంలోనూ అనేక మంది బాలీవుడ్ తారలు తమవైన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు కూడా కొందరు వ్యక్తిగతంగా దూషించటం, విమర్శించటం చేశారు.

గతంలో కూడా అమితాబ్‌ సామాజిక స్థితి గతులపై తమవైన అభిప్రాయాలను ప్రకటించారు. దేశంలో ఫాసిజం వేళ్లూనుకొంటూ పెరిగిపోతున్నదని 2011లో అన్నారు. 2012లో అక్షయ్‌ కుమార్‌.. దేశంలో పెట్రోల్‌ ధరల పెరుగుదలపై స్పందిస్తూ.. ఇకపై సైకిళ్లే దిక్కు అని అన్నారు. వీరే కాకుండా అమీర్ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, అనురాగ్‌ కాశ్యప్‌, రిచా చద్దా లాంటి వారు కూడా ప్రస్తుత సామాజిక స్థితి గతులపై చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ, దురుద్దేశాలను అంటగడుతున్నారు.

అయితే… ప్రస్తుత రాజకీయార్థిక పరిస్థితులపై, సామాజిక స్థితిగతులపై ఎవరికైనా స్పందించే హక్కు ఉన్నదని గుర్తించాలి. ఆ క్రమంలో తమదైన దృక్పథంతో దేశంలోని పరిస్థితులను చూసి స్పందించే, వ్యక్తీకరించే హక్కు, బాధ్యత అందరికీ ఉంటుంది, డాన్ని అందరూ గౌరవించాలి.

Exit mobile version