మరణంపై అనుమానాలు
బెడ్ పై ఆనుతున్న మృతదేహం కాళ్లు
నోటి నుంచి రక్తం..చేతులకు రక్తం మరకలు
ఒంటిపై గాయాలు
కూతురు మరణానికి అతడే కారణమని తండ్రి ఆరోపణలు
విధాత : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ వోటార్కర్(40) అనుమానస్ప స్థితిలో మృతి చెందారు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపిన వివరాల మేరకు చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఫ్యానుకు లుంగీతో ఉరేసుకున్న స్థితిలో చనిపోయింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు సహా పూర్ణచందర్ రావుతో కలిసి ఉంటున్నారని సమాచారం. అతనితో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వేచ్చకు 9వ తరగతి చదువుతున్న ఒక కూతురు ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్‌ను యాడ్ చేశారు. “మనసు నిశ్శద్ధంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అని రాసుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వేచ్చ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె చివరగా ఎవరితో మాట్లాడిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.
స్వేచ్చ మృతిపై అనుమానాలు
యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మృతిపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఉంటున్న ఇంట్లో బెడ్ పై ఫ్యాన్ కు లుంగీతో ఉరి వేసుకున్న స్థితిలో స్వేచ్చ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అయితే కాళ్లు బెడ్ పై ఆనుతుండటంతో..మెడకు ఉరి బిగుసుకునే అవకాశం లేదు. మెడ చుట్టు ఉరి బిగుసుకున్న ఆనవాళ్లు కూడా లేవు. దీంతో ఆమె మరణం ఆత్మహత్య కాదన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. అదిగాక ఉరి వేసుకున్న వ్యక్తి నోటిలో నుంచి నాలిక బయటకు వస్తుంది. కాని స్వేచ్చ నోటి నుంచి నాలిక బయటకు రాకపోగా..నోటిలో నుంచి రక్తం కారుతూ ఉంది. చేతులకు కూడా రక్తపు మరకలు..ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. ఇవన్ని చూస్తే స్వేచ్చ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూతురు మృతిపై అనుమానాలు
తమ కూతురు మృతికి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్చ తండ్రి శంకర్ ఆరోపించారు. భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉంటున్న స్వేచ్ఛ ఈ నెల 26న తాను అతనితో కలిసి ఉండలేనంటూ చెప్పిందని వెల్లడించారు. పెళ్లికి అతను నిరాకరించడంతో మోసపోయానన్న బాధతో ఉందని శంకర్ ఆరోపించారు. నా కూతురు చావుకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వేచ్చ చనిపోయిందని చెప్పిన పూర్ణచందర్ రావు ఆమెను చూసేందుకు రాలేదని తెలిపారు. తల్లి శ్రీదేవి సైతం తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్చ మరణంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది.
