ఏడాది విద్యుత్ ఖర్చు 25 వేల కోట్లు

కేసీఆర్ ఏడాదికి రూ.25 వేల కోట్లు వెచ్చించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం విద్యుత్ అందిస్తున్నారని మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు

  • Publish Date - November 1, 2023 / 02:47 PM IST

– అందుకే తెలంగాణలో 24 గంటలు కరెంటు

– కర్ణాటకలో 5 గంటలే..

– కాంగ్రెస్ గెలిస్తే అధోగతే

– మెదక్ సభలో మంత్రి హరీష్ రావు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదికి రూ.25 వేల కోట్లు వెచ్చించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం విద్యుత్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో కేవలం 5 గంటలే విద్యుత్ వస్తున్నదన్నారు. దీన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు మెదక్, మెదక్ టౌన్, మెదక్ రూరల్ కార్యకర్తల సమావేశంలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకుంటే మెదక్ జిల్లా అయ్యేది కాదన్నారు. బీఅర్ఎస్ పాలనలో మెదక్ జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చేది పక్కగా బీఆర్ఎస్ పార్టీనే అని జోస్యం చెప్పారు.

పార్టీ తల్లి లాంటిదని, కార్యకర్తలు, నాయకులు కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మన పంటలకు నీళ్ళు వచ్చేదా? నీళ్ళ కోసం కష్టాలు తొలగి పోయేవా? కర్ణాటకలో అక్కడి రైతుల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. డీకే శివకుమార్ స్వయంగా 5 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. మనదగ్గర కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి కాంగ్రెస్ వస్తే. ఎలా ఉంటుందో ఊహించాలని అన్నారు. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదు.. సీఎం కేసీఆర్ కే ఇది సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ లో తన్నుకునేవాలళ్లు తప్ప, ప్రజల గురించి ఆలోచించరని విమర్శించారు. రైతుకి 15 వేలు అన్నది రేవంత్ రెడ్డి, కానీ కేసీఆర్ గారు ప్రతి ఎకరాకు 16 వేలు అంటున్నారు. 72 వేల కోట్లు డైరెక్ట్ గా రైతు ఖాతాల్లో వేశాడు కేసీఆర్…ఇది ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు.

రైతు నాయకుడు కేసీఆర్, రైతు బాంధవుడు కేసీఆర్.. అన్ని కుటుంబాలకు 5 లక్షల బీమా ఇవ్వబోతున్నామన్నారు. ఈ సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ వైఫై మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్ హవేలీ ఘన్పూర్ ఎంపీపీలు నారాయణరెడ్డి, యమునా జయరాం రెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అంజా గౌడ్, నాయకులు మాణిక్య రెడ్డి, కిష్టయ్య పాల్గొన్నారు.