ఎంపీపై దాడి ఘటన దిగ్భ్రాంతికరం: గవర్నర్‌ తమిళిసై

  • Publish Date - October 30, 2023 / 12:57 PM IST

విధాత, హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన దిగ్భ్రాంతికరమని గవర్నర్‌ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో జరిగిన ఘటనపై గవర్నర్‌ స్పందించారు. పోలీసు అధికారుల ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది.


వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఎన్నికల ప్రచారాల సందర్భంగా పోటీలో ఉన్న అభ్యర్థుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.