Site icon vidhaatha

కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఆడియో లీక్: బండి సంజయ్

విధాత, యాదాద్రి: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ పాత్ర ఉందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. తనకు ఏ మాత్రం సంబంధం లేదని సంజయ్ వాధిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూ.. ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిజాయితీ నిరూపించుకోవడానికి.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని ఆయన అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మునుగోడులో ఓడిపోతామనే భయం కేసీఆర్ కు పట్టుకుందని అందుకే కొత్త కుట్రకు తెరలేపారన్నారు. స్వాధీనం చేసుకున్న రూ. 15 కోట్లు ఏమయ్యాయని సంజయ్ ప్రశ్నించారు.

అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాంగ్ లాంటిదే ఆడియో టేపుల వ్యవహారమన్నారు. లీకైన ఆడియోలు కూడా సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే లీక్ అయ్యాయన్నాని ఆరోపించారు. నిజమైన ఆడియో అయితే సీఎం ఊరుకుంటారా? దొంగ ఆడియో రికార్డులు తయారు చేయడానికి వారికి రెండ్రోజులు పట్టిందని, నేరస్తులు, ఎమ్మెల్యేల కాల్‌లిస్టు బయట పెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆడియో లీకులు అనేవి అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించినట్టుందని సంజయ్ వెల్లడించారు. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఈ ఉపఎన్నికతో కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి తథ్యం అన్నారు.

Exit mobile version