Bakka Judson
- ధరణి పోర్టల్ పేరుతో భూ దోపిడీ
- బినామీ పేర్లతో టెక్సాస్‌లో భూములు కొన్న యువరాజు
- భూ దోపిడీకి నిదర్శనంగా వట్టి నాగులపల్లి
- కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, విధాత: తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ధరణి పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బక్క జడ్సన్(Bakka Judson) అన్నారు. ధరణి పోర్టల్ రైతుల పాలిట భూతంగా తయారైందని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దోచుకున్న సొమ్మును దుబాయి మీదుగా అమెరికాకు తరలించి టెక్సాస్‌లో బినామీ పేర్లలో యువరాజు భూములు కొన్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకొని భారీ ఎత్తున భూములు కొల్లగొట్టారని, అడ్డగోలుగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని, వాటి సర్టిఫైడ్ కాపీలు కూడ బయటకు రాకుండా చేశారని విమర్శించారు. ఇలా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లి రెవెన్యూ గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో జరిగిన లావాదేవీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆయా సర్వే నెంబర్ల ద్వారా జరిగిన లావాదేవీలలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ డబ్బులు ఎవరెవరికి ఎలా వెళ్లాయి? అన్న దానిపై సమగ్ర విచారణ చేయాలని జడ్సన్ డిమాండ్ చేశారు. తెలంగాణ పైసలు ఎక్కడెక్కడికో పోయాయన్నారు. దుబాయిలో ఒక దళారి యువరాజును రూ.1500 కోట్లకు ముంచారని తెలిపారు.
2018 నుంచే భూదోపిడీ..
తెలంగాణ ప్రభుత్వ పెద్దల భూ దోపిడీ 2018 నుంచి మొదలైందని జడ్సన్ ఆరోపించారు. వైట్ కాలర్ దొంగలు రాత్రికి రాత్రే లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. రైతులకు సులభతరంగా సేవలు అందించాల్సిన ధరణి పోర్టల్ భూతమైందన్నారు. అమ్మో ధరణి అనేంత భయం పట్టకుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ధరణి లొసుగులు చర్చనీయాంశంగా మారాయన్నారు.
భూదోపిడికీ నిదర్శనంగా వట్టి నాగుల పల్లి
తెలంగాణలో జరుగుతున్న భూ దోపిడీకి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి నిదర్శనమన్నారు. అక్కడ జరిగిన భూ అక్రమ లావాదేవీలపై ఢిల్లీలో ఈడీ, ఐటి, సీబీఐలకు ఫిర్యాదు చేశానని జడ్సన్ తెలిపారు. అక్కడ జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్ల వివరాలు కూడా అందించానన్నారు.
ఆయా సర్వే నెంబర్లలోని డాక్యుమెంట్ల ఆధారంగా వేసిన కేసులో మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామన్నారు. ధరణిలో అన్ని రకాల ఆప్షన్లు నాలుగు వారాల్లో తీసుకురావాలని, ధరణిలో వచ్చిన దరఖాస్తులను 4 వారాల్లో పరిష్కరించాలని ఆదేశించారన్నారు.
ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు
ధరణిలో జరుగుతున్న భూ దోపిడీపై, ఐటీ సీజ్ చేసిన సత్యం భూముల క్రయవిక్రయాలపై సవివరంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని జడ్సన్ చెప్పారు. చేవెళ్లలో జరిగిన సభలో అమిత్‌షా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేశాడని ఆరోపించారని, అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
వట్టినాగులపల్లి భూముల స్వాహాకు యత్నాలు
హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న 111 జీవో పరిధిలోని వట్టి నాగులపల్లి గ్రామంలో అనేక మంది పేద, మధ్య తరగతి ప్రజలు వ్యవసాయ భూములు కొనుక్కున్నారని, వాటన్నింటినీ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని జడ్సన్ ఆరోపించారు.
ఫినిక్స్ కంపెనీ కేటీఆర్‌కు బినామీ అని, వీరి కోసమే 111 జీవో ఎత్తివేశారని ఆరోపించారు. వట్టి నాగులపల్లి గ్రామంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎంఆర్‌వో, ఆర్డీవో, కలెక్టర్ సహా సీసీఎల్‌ఏ, సీఎస్ వరకు అందరిపై విచారణచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ రూ.1500 ఎకరాల్లో రూ. 24 వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని, దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ స్కామ్‌పై ఎందుకు విచారణ చేయడం లేదని అమిత్‌షాను జడ్సన్ ప్రశ్నించారు. ఇందులో భాగస్వాములైన అధికారులను తక్షణం డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అక్రమ లావాదేవీల్లో సొమ్ము ఎక్కడి నుంచి ఎవరికి వెళ్లింది? ఎవరు ఎవరికి రిజిస్ట్రేషన్ల చేశారన్న దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని జడ్సన్ డిమాండ్ చేశారు.