Site icon vidhaatha

‘ఆహా’కు బాల‌య్య షాక్?.. నెట్‌ఫ్లిక్స్‌లో టాక్‌ షో?

విధాత‌: నందమూరి నటసింహం బాలకృష్ణది ఒక సపరేటు రూట్. ఆయన తనకు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర భాషల్లోనూ పాపులారిటీ కావాలని ఆశపడడు. ఇప్పటివరకు ఆయన కోలీవుడ్, బాలీవుడ్‌లో మొహమే చూడలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రేక్షకులను మాత్రమే ఆయన దృష్టిలో ఉంచుకుంటారు.

తాను 100వ చిత్రంగా కృష్ణవంశీతో ‘రైతు’ అనే చిత్రం చేయాలనుకున్నాడు. కానీ అందులోని ఓ కీలక పాత్రకు అమితాబచ్చన్ తప్ప మరెవ్వరు సరిపోరని ఆయన భావించాడు. కానీ అమితాబ్ నో అన్నాడట. దాంతో ఆ సినిమానే పక్కన పెట్టేశాడు బాలయ్య. అది ఆయన మెంటాలిటీ.

ఇక నర్తనశాల అనే సినిమాని తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించాడు. అంతలోనే ద్రౌపదిగా నటించాల్సిన సౌందర్య మరణించడంతో ఆ సినిమాని ఆపేయడమే కాదు.. తన దర్శకత్వానికి కూడా బ్రేక్ వేశాడు. ఇలా బాలయ్య బాబు ఏ విధంగా చూసుకున్నా.. చాలా మంది కంటే చాలా విభిన్నం. ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవులపై ముఖ్యమంత్రి పీఠంపై ఎలాంటి ఆశ లేదు.

ఇక విషయానికొస్తే బాలయ్య ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడు.. ఏమీ మాట్లాడడు.. విసుక్కుంటాడు.. తిడతాడు.. సరదాగా మాట్లాడడం చేతకాదు.. అనే వారందరికీ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో చెక్ పెట్టేసింది. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేశాడు.

మోహన్ బాబుతో మొదలుపెట్టి మహేష్ బాబుతో ఎండ్ చేశాడు. ఆ తర్వాత వెంటనే మరలా ఆహా అధినేత అరవింద్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 ని తెరపైకి తెచ్చాడు. ఇందులో భాగంగా ఆయన మొదటి ఎపిసోడ్‌కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, తన అల్లుడు.. కాబోయే సీఎంగా ప్రచారం జరుగుతున్న నారా లోకేష్‌ను పిలిపించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ప్రభాస్‌తో ఎపిసోడ్‌ చేశాడు. ఈ ఎపిసోడ్ మొదటి భాగం ఇటీవలే టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఈ షోకి తీసుకొని వచ్చిన ఘనత బాలయ్యకు దక్కుతుంది. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయింది.

సంక్రాంతికి స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోలో ఆయన మాట తీరు, మాటకారితనం ఆకట్టుకుంటున్నాయి. చమక్కులు విసరడం, చలోక్తులు మాట్లాడడం, సెటైర్లు వేయడం, నానా అల్లరి చేయడం, వారి నుండి అతి రహస్యమైన విషయాలను కూడా రాబడుతూ తనదైన శైలిలో ముందుకు దూసుకుని పోతున్నాడు. ఈ షో బాలయ్యలోని మరో యాంగిల్‌ను బయటికి తీసుకుని వచ్చింది.

దీంతో బిగ్ బాస్ వంటి షోకి కూడా ఏడో సీజన్లో బాలయ్యను హోస్ట్‌ చేయమని అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో వార్త వైరల్‌గా మారింది. మరో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం సరికొత్త టాక్ షోను తీయాల‌ని ఆలోచనలో ఉందంటున్నారు.

ఇక నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ కార్యక్రమాన్ని బాలయ్యతోనే చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సబ్‌స్క్రైబర్స్ విషయంలో ఆహా కన్నా నెట్‌ఫ్లిక్స్ ఎంతో ఎత్తులో ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో బాలయ్య టాక్‌ షో రాబోతుంది అనడంతో ఈ కార్యక్రమానికి ఇతర దేశాలలో కూడా మంచి ఆదరణ వస్తుందని చెప్పాలి.

ఇప్పటికే ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో లో జరిగే సంభాషణలను సబ్ టైటిల్స్‌తో ప్రసారం చేస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్‌లోకి బాలయ్య ఎంటర్ అయితే ఆ రేంజే వేరు అన్నట్టుగా సాగుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ప్ర‌స్తుతానికి ఈ వార్త బాగా వైరల్ అయితే అవుతోంది.

Exit mobile version