Site icon vidhaatha

BBC భారత కార్యాలయాల్లో ఐటీ ‘సోదాల’ వెనుక!

IT Raids on BBC

విధాత: దేశంలో పెను సంచలనం రేపిన ఇండియాః ది మోదీ క్వశ్చన్‌ (India: The Modi Question) డాక్యుమెంటరీని రూపొందించిన బీబీసీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందా? తనను విమర్శించే, తనను వ్యతిరేకించే సంస్థలు, వ్యక్తులపైకి ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఎగదోస్తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం అదే కోవలో బీబీసీపైనా కన్నెర్ర చేసిందా? ఒకప్పడు దూరదర్శన్‌, ఆకాశవాణి కన్నా విశ్వసనీయమైనదని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ నోట ప్రశంసలు అందుకున్న బీబీసీని పన్ను ఎగవేసిందంటూ బీజేపీ నేతలు సైతం తిట్ల పురాణం అందుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నదా? అంటే.. అవుననే అనుమానాలే కలుగుతున్నాయి.
సర్వే మాత్రమేనట!

అంతర్జాతీయ పన్ను చెల్లింపులపై ఆరోపణలు, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌లో అవకతవకలు వంటి అంశాలపై సర్వే జరుగుతున్నదని అధికారవర్గాలు పేర్కొంటున్నా.. బీబీసీ డాక్యుమెంటరీ తర్వాతే ఐటీ అధికారులు ఈ చర్యకు దిగడం అనుమానాలను కలిగిస్తున్నది. ఇవి తనిఖీలు కావని, సర్వే మాత్రమేనని అధికారులు అంటున్నారు.

ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలువురు బీబీసీ పాత్రికేయుల మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను, కొన్ని డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్‌ చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఐటీ అధికారులు ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాల్లో ఉన్నారని, వారికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని బీబీసీ ట్విట్టర్‌లో పేర్కొన్నది.

సాధ్యమైనంత త్వరలో ఇది పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపింది. ఆఫీసులో లేని సిబ్బంది కార్యాలయానికి దూరంగా ఉండాలని, ఆఫీసులో ఉన్నవారు భయపడవద్దని బీబీసీ తన సిబ్బందికి ఒక మెమో పంపింది. ఈ విషయాన్ని తాము చూసుకుంటున్నామని తెలిపింది. సర్వే పేరుతో వచ్చిన అధికారులు బీబీసీ సిబ్బంది ఎవరినీ ఎవరికీ ఫోన్‌లు చేయొద్దని ఆదేశించినట్టు సమాచారం.

ఇది సర్వే మాత్రమేనని, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇచ్చేస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది. ఖాతాలు, బ్యాలెన్స్‌ షీట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని తమ ఫైనాన్స్‌ విభాగం సిబ్బందిని కోరామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఇవి సోదాలు కావని, సర్వే మాత్రమేనని తెలిపారు. ఈ సోదాల్లో సుమారు 20 మంది ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నట్టు సమాచారం.

మండిపడిన విపక్షాలు

దేశంలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల నివాసాలు, వారి కార్యాలయాలతో పాటు.. పలు సంస్థల కార్యాలయాల్లోనా ఐటీ, ఈడీ సోదాలు పెరిగాయనేది వాస్తవం. ప్రత్యేకించి మీడియాను గుప్పిట్లో ఉంచుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే 2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న మత ఘర్షణలు, ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా వాటిలో ఆయన పాత్ర తదితర అంశాలపై బీబీసీ ఇటీవల ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ అనే డాక్యుమెంటరీని రెండు భాగాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేసింది.

అయితే.. భారత్‌లో మాత్రం అది ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలపై నిషేధం విధించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రోజుల పాటు బీబీసీ డాక్యుమెంటరీ అంశం ప్రధాన చర్చగా సాగింది.

గుజరాత్‌ మారణకాండకు సంబంధించి మోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో ఉద్దేశపూర్వకంగా బీబీసీని లక్ష్యం చేసుకుని సోదాలకు తెర తీశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీబీసీ డాక్యుమెంటరీతో మోదీ భయపడ్డారనేందుకు తాజా చర్య నిదర్శనమని చెప్తున్నాయి. ఇది ముందే ఊహించిందేనని అంటున్నాయి.

ఒక ప్రభుత్వం భయపడుతున్నదంటే దానికి అంతం దగ్గరలోనే ఉన్నట్టని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అదానీ కుంభకోణంపై తాము సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేస్తుంటే.. కేంద్రం బీబీసీ వెంటపడిందని కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు.

‘వినాశకాలే విపరీతి బుద్ధి’ అంటూ ట్వీట్‌ చేశారు. నిజాలు మాట్లాడే వారిపై కేంద్రం దాడులు చేస్తున్నదని జేకే పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. ఇది అనూహ్యమేమీ కాదని, అయితే..దీనిపైబ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషిసునాక్‌ ఎలా స్పందించారో చూడాలని ఉన్నదని సీపీఎం ఎంపీ జాన్‌ బిట్టాస్‌ అన్నారు. నిజం మాట్లాడే గొంతులు నులిమేస్తున్నారని సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినయ్‌ విశ్వం పేర్కొన్నారు.

నాడు విశ్వసనీయమైనది.. నేడు విషపురుగా?

బీబీసీపై అధికార బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విశేషం ఏమిటంటే.. ఇదే బీబీసీని ప్రధాని మోదీ ఒకప్పుడు ప్రశంసిస్తూ.. దూరదర్శన్‌, ఆకాశవాణి కంటే విశ్వసనీయమైదని చెప్పారు.

కానీ.. ఇప్పడు అదే బీబీసీ.. బీజేపీ నాయకులకు విషపూరితంగా కనిపిస్తుండటం విశేషం ఏమీ కాదేమో! బీబీసీ విషపూరితమైనదని, సత్తా లేనిదని, ఒక అజెండా పెట్టకుని రిపోర్టింగ్‌ చేస్తుంటుందని దుమ్మెత్తి పోస్తున్న బీజేపీ నాయకులు.. ఐటీ శాఖ తన పని తాను చేసుకుని పోయేందుకు అనుమతించాలని సలహా ఇస్తున్నారు.

Exit mobile version