Site icon vidhaatha

BRS | బీఆరెస్‌లో టికెట్ల పంచాయితీ వెనుక!

BRS |

విధాత: టికెట్ల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నియోజక వర్గాల వారీగా దాదాపు 100 సీట్లకు అభ్యర్థులు వీరే అని మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో రాడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్న రీతిలో నేతలు బలప్రదర్శన మొదలుపెట్టారు.

అసలు అధికార పార్టీలో ఏం జరుగుతున్నది? కచ్చితంగా మూడోసారి మాదే అధికారం అన్న నేతలు ఇప్పుడు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నారు? సొంతపార్టీ నేతల్లోనే చిచ్చు రాజేసే ఈ లీకులు ఎవరు ఇస్తున్నారు? కార్యకర్తలను, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసే కొందరు నేతల ప్రకటనలపై పార్టీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కేసీఆర్‌ గతంలో ఏం చెప్పారు? ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి పరిశీలిస్తే…

సిటింగ్‌లందరికీ టికెట్లు గ్యారెంటీ, ఇంతకంటే మంచి అభ్యర్థులు మాకు దొరుకుతారా? అని అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అంతేకాదు సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, వందకు పైగా స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు తలదూర్చవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. నాటి మాటలన్నీ వమ్మయ్యాయి.

ఈ ఐదారు నెలల కాలంలోనే అధికార ‘కారు’ పార్టీలో కల్లోలం మొదలైంది. స్టేషన్ ఘన్‌పూర్‌, జనగామ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలే అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోటీ అయ్యారు. ఇది ఇక్కడితో ఆగే అవకాశం కనిపించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆశావహులు ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే అధికారపార్టీలో సీఎం చెప్పిన సర్వేలు ప్రామాణికంగా నిలుస్తాయా అన్నం అంశంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

20కిపైగా స్థానాల్లో పోటాపోటీ

నాగార్జునసాగర్‌, రామగుండం, వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, తాండూరు, ఆలేరు, నకిరేకల్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, చెన్నూరు, కోరుట్ల.. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 20కిపైగా స్థానాల్లో అధికారపార్టీ నేతలే బలప్రదర్శనకు దిగుతున్నారు. సర్వేల సంగతి పక్కకు పోయి మారుతున్న సమీకరణాలతో అధికారపార్టీ కార్యకర్తలు, శ్రేణులు అయోమయంలోకి గురవుతున్నారు.

టికెట్ల కేటాయింపులో తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే అయినా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులది కూడా కీలకపాత్రే అన్నది బహిరంగ రహస్యమే. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్‌ నాదంటే నాది అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ముగ్గురు నేతలలో వారికి ఎవరైనా హామీ ఇచ్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ప్రశాంతంగా ఉన్న తన నియోజకవర్గాన్ని కార్పొరేట్‌ పద్ధతిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు. తనను ఎదుర్కోలేక తన ఇంట్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చేశారు కూడా! ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోని వ్యక్తి ఇప్పుడు నియోజకవర్గంలో తనకే టికెట్‌ వచ్చిందని ఎలా ప్రచారం చేసుకుంటారని ధ్వజమెత్తారు. ముత్తిరెడ్డి మాటలు చూస్తే కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉన్నదని, ఆయన ఈ కుట్రలన్నీ చేస్తున్నారంటూ.. ఒకవేళ తనకు టికెట్‌ రాకపోతే ఏం జరుగుతుందో అని చెప్పకనే చెప్పారు.

కలిసి పనిచేస్తారా?

కొన్ని నియోజకవర్గాల్లో నేతల బలప్రదర్శనతో టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశం లేదని తేలిపోతున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి తానే పోటీ చేస్తాననని హీరో అల్లు అర్జున్‌ మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించుకున్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంతో చంద్రశేఖర్‌రెడ్డి బలప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో బీఆరెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ముత్తిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో మారుతున్న సమీకరణాలతో అభ్యర్థుల ప్రకటనకు ముందే నాలుగైదు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు టికెట్ల చిచ్చు రాజేయగా తీరా సమయానికి ఇంకా ఎంతమంది బైటపడుతారన్నది చూడాలి.

ఇవాళ వీఎస్‌టీ-ఇందిరాపార్క్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది అన్నారు. సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ హ్యాట్రిక్‌ సంగతి ఏమో గాని కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందా? నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

Exit mobile version