Karpoori Thakur | బిహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ను కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ స్వాతంత్ర్య సమరయోధుడి, ఉపాధ్యాయుడిగా, రాజకీయవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన బిహార్ రెండో ఉప ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. పబ్లిక్ హీరోగా ఆయనకు పేరున్నది. ఇంతకీ ఎవరాయన.. భారత రత్న పురస్కారం ఎందుకు వరించిందో ఓసారి తెలుసుకుందాం..
రాజకీయాల్లో సామాజిక జ్వాల..
కర్పూరీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో సామాజిక న్యాయం జ్వాల రగిలించిన నేత. కర్పూరీ ఠాకూర్ సాధారణ మంగలి కుటుంబంలో జన్మించారు. తన జీవితమంతా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను అనుసరించి రాజకీయంగా నిలదొక్కుకున్నారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందిరా గాంధీ ఆయనను అరెస్టు చేయలేకపోయారు. కర్పూరి ఠాకూర్ 1970లో బిహార్‌కు తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 22 డిసెంబర్ 1970న ఆయన తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం కేవలం 163 రోజులే. 1977లో జనతాపార్టీ భారీ విజయం సాధంచింది.
కర్పూరీ ఠాకూర్ బీహార్‌లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. రెండేళ్ల పదవీకాలంలో సమాజంలోని అణగారిన ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేశారు. బీహార్‌లో మెట్రిక్యులేషన్ వరకు విద్య ఉచితంగా అందించారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో హిందీలో హిందినీ తప్పనిసరి చేశారు. తన పదవీకాలంలో పేద, వెనుకబడ్డ వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన చేసిన పనులు బిహార్ రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకువచ్చారు. కర్పూరి ఠాకూర్ రాజకీయ శక్తిగా ఎదగడంతో పాటు ఆయన ‘జన నాయక్’గా పేరు పొందారు.
కర్పూరీ శిష్యులే.. లాలూ, నితీశ్
లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ ఇద్దరూ కర్పూరీ ఠాకూర్ శిష్యులే. జనతా పార్టీ హయాంలో కర్పూరీ ఠాకూర్ నుంచి లాలూ, నితీశ్ రాజకీయాలలో మెలకువలు నేర్చుకున్నారు. ఈ క్రమంలో బిహారల్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చిన సమయంలో కర్పూరీ ఠాకూర్ భావజాలాన్ని, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు. నితీశ్ కుమార్ సైతం వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు.
బీహార్ రాజకీయాల్లో కీలక వ్యక్తి కర్పూరీ ఠాకూర్
బిహార్ రాజకీయాల్లో కర్పూరీ ఠాకూర్‌ను ప్రస్తావించలేం. కర్పూరి ఠాకూర్ 1988లో మరణించారు. చాలా సంవత్సరాల పాటు ఆయన బిహార్‌లో వెనుకబడి, అత్యంత వెనుకబడిన వర్గాల ఓటర్లలో ఆయనకు చెరగని స్థానం ఉన్నది. బీహార్‌లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన ప్రజల జనాభా దాదాపు 52శాతం కావడం గమనార్హం. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభావాన్ని చాటుకునేందుకు కర్పూరీ ఠాకూర్ పేరును వాడుకుంటాయి. 2020లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ‘కర్పూరీ ఠాకూర్ ఫెసిలిటేషన్ సెంటర్’ను ప్రారంభిస్తామని ప్రకటించడానికి కారణం ఇదే.
ఆయన రాజకీయ ప్రయాణం..
కర్పూరీ ఠాకూర్ ఎన్నికల ప్రయాణం 1950ల ప్రారంభంలో ప్రారంభమైంది. ఆ తర్వాత రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. శ్రామికవర్గం, కూలీలు, చిన్న రైతులు, యువకుల పోరాటానికి ఆయన బలమైన గొంతుకగా నిలిచారు. తన రాజకీయ జీవితంలో నిరుపేదలకు విద్యను అందించేందుకు ఉన్న అవకాశాల్లో ఏ ఒక్కదాన్ని వదల్లేదు. స్థానిక భాషల్లో విద్యను అందించేందుకు కృషి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రజాస్వామ్యంపై ఆయనకున్న అంకితభావం కనిపిస్తుంది.
ఎమర్జెన్సీని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్, డాక్టర్ రాం మనోహర్ లోహియా, చరణ్ సింగ్ వంటి ప్రముఖులు సైతం ఆయన నుంచి బాగా ప్రభావితమయ్యారు. సమాజంలోని వెనుకబడిన, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వెనుకబడిన వర్గాల కోసమే కాకుండా అన్ని వర్గాల కోసం ఆయన కృషి చేశారు.
ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగతంగా వాడుకోవద్దని..
ప్రభుత్వ సొమ్ములో ఒక్క పైసా కూడా తన వ్యక్తిగత పనుల్లో వినియోగించకూడదని ఆయన బీష్మించుకొని ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీహార్‌లో ఓ ఘటన జరిగింది. రాష్ట్రంలోని నాయకులకు కాలనీ నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఆయన తన కోసం భూమి తీసుకోలేదు. భూమి ఎందుకు తీసుకోవడం లేదని అడిగినప్పుడల్లా మర్యాదగా చేతులు ముడుచుకుని ఉండేవారు. 1988లో ఆయన మరణించిన సమయంలో పలువురు నాయకులు ఆయన గ్రామాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన ఇంటి పరిస్థితిని చూసి ఇంత ఉన్నత పదవిలో పని చేసిన వ్యక్తికి ఇంత సాదాసీదా ఇల్లు ఇలా ఉంటుందా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కర్పూరీ ఠాకూర్ సింప్లిసిటీకి ఓ ఘటన అద్దం పడుతుంది. 1977లో బీహార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అయిన సమయంలో కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉన్నది. జనతా పార్టీ నాయకుడు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ పుట్టినరోజు కోసం చాలా మంది నాయకులు పాట్నాకు చేరుకున్నారు. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుర్తా చిరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ ఆయనకు కొత్త కుర్తా కొనుగోలు చేసేందుకు విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విరాళాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించిన ఆయన.. ఆ నిధిని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
కర్పూరి ఠాకూర్ 100వ జయంతి
కర్పూరి ఠాకూర్ ఠాకూర్ 24 జనవరి 1924లో జన్మించారు. ఆయన 100వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కర్పూరీ ఠాకూర్‌ను కలిసే అవకాశం ఎప్పడూ తనకు రాలేదని.. ఆయనతో సన్నిహితంగా పని చేసిన కైలాసపతి మిశ్రా నుంచి ఆయన గురించి చాలా విన్నానన్నారు.
సామాజిక న్యాయం కోసం కృషి చేసి.. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో పెను మార్పు తెచ్చి జన నాయక్‌గా నిలిచారన్నారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. ఆయన సామాజిక న్యాయం వెలుగు అని.. శత జయంతి జరుపుకుంటున్న తరుణంలో భారత ప్రభుత్వం భారత రత్న ప్రదానం చేయాలని నిర్ణయించుకున్నందుకు సంతోషిస్తున్నానన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అట్టడుగు వర్గాలకు ఛాంపియన్‌గా, సమానత్వం, సాధికారత కోసం కృషి చేసిన ఆయన నిరంతర ప్రయత్నానికి నిదర్శనమని ప్రధాని ట్వీట్ చేశారు.