Bhatti | అన్నదాతను ఓ వైపు అకాల వ‌ర్షం ముంచుతుంటే.. మ‌రో వైపు ప్ర‌భుత్వం నయవంచన చేస్తుంది..

Bhatti Vikramarka కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కొనుగోలు చేయ‌ని అధికారులు భట్టి విక్రమార్కకు గోడు వెళ్ళబోసుకున్న రైతులు 41 వ రోజుకు చేరిన పీపుల్స్ మార్చ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నదాతను అకాల వర్షం ఒకవైపు ముంచెత్తుతుంటే మరోవైపు ప్రభుత్వం రైతన్న జీవితాలతో చెలగాటమాడుతుందని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనే వాళ్ళు లేక రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం […]

  • Publish Date - April 26, 2023 / 01:24 PM IST

Bhatti Vikramarka

  • కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు
  • కొనుగోలు చేయ‌ని అధికారులు
  • భట్టి విక్రమార్కకు గోడు వెళ్ళబోసుకున్న రైతులు
  • 41 వ రోజుకు చేరిన పీపుల్స్ మార్చ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నదాతను అకాల వర్షం ఒకవైపు ముంచెత్తుతుంటే మరోవైపు ప్రభుత్వం రైతన్న జీవితాలతో చెలగాటమాడుతుందని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనే వాళ్ళు లేక రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు నీటిపాలైతున్నాయని బాధను వ్యక్తం చేశారు.

పంటలు అద్భుతంగా పండాయని చెబుతున్న ప్రభుత్వం కొనుగోలు చేయడంలో చేస్తున్న జాప్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కాజీపేట డీజిల్ కాలనీలో రాత్రి బస చేసిన టెంట్ వద్ద సీఎల్పీ నేతను సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు బుధవారం ఉదయం కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఖాజీపేట్ రైల్వే వ్యాగన్ తయారీ వ్యాగన్ పీ.ఓ.హెచ్. వర్క్ షాప్ కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదంటూ సీఎల్పీ నేతకు జేఏసీ నాయకులు దేవులపల్లి రాఘవేందర్, కోండ్రు నర్సింగరావు వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

అనంతరం 41వ రోజు పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర బుధవారం మ‌ధ్యాహ్నం మడికొండ మీదుగా స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వర్గంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా భట్టికి స్టేషన్గన్పూర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డప్పుల చ‌ప్పులు కాంగ్రెస్ నినాదాలు మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ నాయకులు ఇందిరా వర్గం కృష్ణ వర్గం మధ్య పోటాపోటీ సాగింది.

భట్టికి గోడు చెప్పుకున్న అన్నదాతలు

ధ‌ర్మ‌సాగ‌ర్ చేరుకున్న భ‌ట్టి విక్ర‌మార్క వ‌ద్ద‌కు వ‌చ్చిన రైతులు అల్లడి ఎల్ల‌మ్మ‌, బంక రాకేష్ త‌మ క‌న్నీటి గోస‌ను చెప్పుకున్నారు. ధ‌ర్మ‌సాగ‌ర్ ఐకేపీ కేంద్రానికి 5 లారీల ధాన్యం తెచ్చి ప‌ది రోజులు అయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారులు కొనుగోలు చేయ‌లేదు. ఎన్నిసార్లు అడిగినా ఈరోజు, రేపు అని తిప్పుతున్నారు కానీ, కోనుగోలు చేయ‌లేద‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతూ విక్ర‌మార్క‌కు చెప్పారు.

ఈ అకాల వ‌ర్షానికి 5 లారీల ధాన్యం మొత్తం త‌డిసిపోయింది. మొల‌క‌లు వ‌చ్చాయి. మొత్తం పంటంతా న‌ష్ట‌పోయాము. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసుంటే మా బ‌తుకులు బాగుప‌డేవంటూ.. భ‌ట్టికి చెప్ప‌కున్నారు. అంతా విన్న విక్ర‌మార్క మాట్లాడుతూ.. మీకు, మీలాంటి అన్న‌దాత‌ల కోస‌మే మేమంతా రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేస్తున్నామని చెప్పారు.

మీకంద‌రికీ న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌ని చెప్పారు. రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైంది అన్నారు. కార్యక్రమంలో స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ నాయకులు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి కొనసాగిన పాదయాత్ర అనంతరం వేలేరు వరకు సాగింది.

Latest News