లోక్‌సభ ఎన్నికలపై గణాంకాలు చెబుతున్న వాస్తవాలేంటి?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర పడుతున్నకొద్దీ కమలనాథులు కొత్త రాగాలు ఆలపిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తమకు 370 సీట్లు ఇవ్వాలని ప్రధాని దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నారు

  • Publish Date - February 26, 2024 / 08:29 AM IST

  • బీజేపీ ఆశ 370.. టార్గెట్‌ 270!
  • మెజార్టీ మార్కు దాటేందుకే ఆపసోపాలు!
  • బలపడుతున్న ఇండియా కూటమి
  • బీజేపీ బలమైన సవాలుగా రైతు ఆందోళన


(విధాత ప్రత్యేకం)


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర పడుతున్నకొద్దీ కమలనాథులు కొత్త రాగాలు ఆలపిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తమకు 370 సీట్లు ఇవ్వాలని ప్రధాని దేశ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పార్టీ శ్రేణులకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2019లో బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించింది. ఈసారి ఆ సంఖ్యను 370కి పెంచుకోవాలని, భాగస్వామ్య పార్టీల వచ్చే సీట్లతో కలుపుకొని 400 మార్కు దాటుతానని నేతలు బయటకు చెప్పుకొంటున్నా.. ప్రస్తుత పరిణామాల్లో మెజారిటీ మార్క్‌ దాటడంపైనే మోదీ-షా దృష్టి సారించినట్టు అర్థమౌతున్నది.


ఎందుకంటే పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. గతంలో కంటే ఈసారి విపక్షాలు బలపడ్డాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని కొన్ని ప్రాంతీయపార్టీలు (ఒడిశాలో బిజూ జనతాదళ్‌, ఏపీలో వైసీపీ, టీడీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బెంగాల్‌లో టీఎంసీ, పంజాబ్‌లో అకాలీదళ్‌) వంటివి బలంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్‌ను, ప్రాంతీయపార్టీలను ఢీకొట్టి బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకోవడం అంత తేలికకాదు.

ఆ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలిస్తేనే


మోదీ నిర్దేశించిన 370 టార్గెట్‌ చేరుకోవాలంటే బెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో కమలనాథులు మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలి. 2019లో ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీకి బెంగాల్‌లో 42\18, ఒడిశాలో 21\8, తెలంగాణలో 17\4, పంజాబ్‌లో 13\2, జమ్ముకశ్మీర్‌ లో 6\3 సీట్లు వచ్చాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయనున్నది. అక్కడ కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పోటీలో ఉంటున్నాయి. కనుక అక్కడ త్రిముఖ పోరులో బీజేపీ గతంలో గెలుచుకున్న 18 సీట్లను తిరిగి నిలబెట్టుకోవడమే కష్టం. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


ఇటీవల దేశవ్యాప్తంగా బెస్ట్‌ సీఎం జాబితాలో నవీన్‌ పట్నాయక్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన కేంద్ర రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఆయన తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. అక్కడ బిజూ జనతాదళ్‌, కాంగ్రెస్‌ పార్టీతో పోటీ పడి బీజేపీ గతంలో గెలుచుకున్న 8 సీట్ల కంటే ఎక్కువ దక్కించుకుంటుందా? లేక ఉన్నవి కోల్పోతుందా? అన్నది చూడాలి. ఇక తెలంగాణలో గతంలో గెలిచిన 4 సీట్లను తిరిగి గెలుచుకుంటే అదే గొప్ప అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి తయారైంది. ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ విజయోత్సాహంతో ఉంటే.. పవర్‌ కోల్పోయిన బీఆర్‌ఎస్‌ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నది.


ఇక్కడ ఈ రెండు పార్టీలను కాదని బీజేపీకి ఏకపక్షంగా సీట్లు కట్టబెట్టే పరిస్థితులు లేవు. ఎందుకంటే కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌, బండి సంజయ్‌ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్నా రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా సాధించడంలో, విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. కనుక ఇక్కడ కమలనాథుల ఆశలు కలగానే మిగులుతాయన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా. ఇక పంజాబ్‌ మినహా ఢిల్లీ, గుజరాత్‌, గోవా, హరియాణాల్లో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉండటం, ఇక్కడ ఒంటరిగానే పోటీచేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం అధిష్ఠానాన్ని కోరడంతో ఎవరికి వారుగా పోటీ చేయాలని అవగాహనకు వచ్చారు.


అక్కడ ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామిపార్టీ అకాలీదళ్‌ కూడా పోటీలో ఉంటుంది. ఇక్కడ చతుర్ముఖ పోటీలో బీజేపీ గతంలో గెలుచుకున్న రెండు సీట్లను నిలబెట్టుకున్నా, అంతకు మంచి ఒకటి రెండు సీట్లు సాధించినా గొప్పే అంటున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన బీజేపీ 2019 నుంచి ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. అక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. ఆ ఆర్టికల్‌ రద్దు అయిన నాలుగేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) కూటమి విజయం సాధించింది. మొత్తం 26 సీట్లలో ఎన్‌సీ 12 సీట్లు సాధించగా.. కాంగ్రెస్‌ 10 స్థానాలు కైవసం చేసుకున్నది. బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది. దీంతో గతంలో అక్కడ 3 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి కష్టమే. ఎందుకంటే అక్కడ ప్రాంతీయపార్టీలైన పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండూ ఇండియా కూటమితోనే ఉన్నాయి. కనుక బీజేపీ ఈ ఐదు రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించడం సంగతి అటుంచితే ఉన్నవి కోల్పోకుంటే అదే పదివేలు అంటున్నారు.

గత ఎన్నికల్లో స్వీప్‌.. ఈసారి టఫ్‌


తమిళనాడు, ఏపీ, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ, పుదుచ్చేరి లోక్‌సభ సీట్ల సంఖ్య మొత్తం 91. ఇక్కడ బీజేపీ గత ఎన్నికల్లో 51 చోట్ల పోటీ చేసి ఒక్కసీటును కూడా తన ఖాతాలో వేసుకోలేపోయింది. ఈ సమయంలో మోదీ నిర్దేశించిన 370 సీట్ల లక్ష్యం ఆచరణలో సాధ్యం కాదని అర్థమౌతున్నది. మధ్యప్రదేశ్‌ 29\28 గుజరాత్‌ 26\26, రాజస్థాన్‌ 25\24, కర్ణాటక 28\25, జార్ఖండ్‌ 14\11, హర్యానా 10\10, ఢిల్లీ 7\7, హిమాచల్‌ప్రదేశ్‌ 4\4 బీజేపీ దాదాపుగా స్వీప్‌ చేసింది. ఈసారి ఆయా రాష్ట్రాల్లో ఎదురుగాలి తప్పకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే పంటలకు కనీస మద్దతు ధర విషయంలో రైతుల ఆందోళన ఈ రాష్ట్రాలపై ఉంటుంది. ఈ నేపథ్యంలో కమలనాథులు తమ లక్ష్యం 370 ప్రచారం చేస్తున్నారు కానీ అసలు టార్గెట్‌ 270 అన్నది కనిపిస్తున్నది.

Latest News