విధాత: ఖమ్మంలో నిర్వహించిన భారత్ రాష్ట్రసమితి భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ముగ్గురు ముఖ్యమంత్రులు.. పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా సభకు హాజరైన అశేష జనవాహినికి సందేశాలిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశాన్ని తెగనమ్ముతున్నదని ఆరోపిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజాసంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ప్రపంచంలోనే భారత దేశాన్ని ప్రథమ స్థానంలో నిలుపవచ్చని తెలిపారు. ఈ అశేష ప్రజానీకం ఇచ్చిన ప్రోత్సాహం, ఉత్తేజంతో.. తాము తమ రాష్ట్రాలకు పోయి కేంద్రంలో ప్రజానుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామని ప్రకటించారు.
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నం: సీఎం పినరయి
కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అని కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పినరయి విజయన్ పాల్గొని ప్రసంగించారు.
కేంద్రం వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు. తెలంగాణ తరహాలోనే కేరళ కూడా అనేక పథకాలు చేపట్టాంది. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోంది.
తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది. కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగా హిందీని బలవంతంగా మన మీద రుద్దుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇవాళ దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినొద్దు. గవర్నర్ వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని పినరయి విజయన్ స్పష్టం చేశారు.
దేశాన్ని కులం మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. చట్ట సభల్లో చర్చలు జరగకుండానే బిల్లులను బలవంతంగా పాస్ చేస్తున్నారు అని పినరయి విజయన్ మండిపడ్డారు.
విద్యా, వైద్యం బాగుంటేనే అభివృద్ధి: సీఎం కేజ్రీవాల్
దేశంలో విద్యా, వైద్యం బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగిస్తూ ‘ఇవాళ రెండు బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్పది. పెద్దన్నలా ఎవరి కంటికి ఇబ్బంది వచ్చినా సీఎం కేసీఆర్ రెప్పలా కాపాడుకుంటున్నారు. కంటి వెలుగు అమలు తీరు అద్భుతం. పంజాబ్, ఢిల్లీలోనూ కూడా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెడుతాం.
సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతం. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల వలన ప్రజలకు చాలా ఉపయోగం కలుగుతుంది. కొట్లాడటం కాదు.. నేర్చుకుంటే దేశం ఎక్కడికో వెళ్తుంది. ఢిల్లీ స్కూళ్లను చూసి తమిళ నాడులో స్టాలిన్ స్కూళ్లల్లో మార్పులు తెచ్చారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లు చూసి.. కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రవేశపెట్టారు.
మన కంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి.. మనకేం తక్కువ..? దేశంలో విద్యా, వైద్యం బాగుంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఒకర్నుంచి ఒకరు నేర్చుకుంటే అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా దేశం వెనుకబడి ఉంది. గవర్నర్లు ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నారు. మన కంటే వెనుక స్వాతంత్య్రం వచ్చిన సింగపూర్ అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని’ తెలిపారు. సీఎంలను ఇబ్బంది పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది: అఖిలేష్ యాదవ్
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అఖిలేష్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సభకు వచ్చిన జనమే దేశానికి ఒక సంకేతం. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుంది. చారిత్రాక ఖమ్మం నగరం జనసంద్రంగా మారింది. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. కేంద్రం ఢిల్లీలో కూర్చొని ఒక్కో రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. బీజేపీని తరిమికొట్టే పోరాటం ఈ నేల నుంచే ప్రారంభం కావాలి. ఇంత పెద్ద సభను గతంలో నేనేప్పుడు చూడలేదు.
బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోంది. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోంది. రైతులన్ని ఆదుకుంటామని మాట తప్పారు. విపక్ష నేతలపై కేసులు పెట్టి ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది బీజేపీ. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, చేతులేత్తెశారు. మోదీ 400 రోజులే మిగిలి ఉన్నాయని అంటున్నారు.
అంటే కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటుందని తెలిపారు. ఇవాళ్టితో కేంద్రానికి కేవలం 399 రోజులు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్టే, యూపీలోను జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారింది.
ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోంది. బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తేనే దేశానికి కొత్త మార్గం దొరుకుతుంది. యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు. కేసీఆర్ తక్కువగా మాట్లాడి, ఎక్కువగా పని చేస్తారు అని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు.
సెక్యులర్ పార్టీలన్నీ కేంద్రంపై పోరాడాలి: డీ రాజా
సెక్యులర్ పార్టీలన్ని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. ఈ వేదిక నుంచి దేశానికి ఒక మేసేజ్ వెళ్లాలి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో డీ రాజా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ప్రజలకు సురక్షిత మంచినీరు అందుతుంది. నిరంతర కరెంట్ అందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అద్భుతం. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు. ఈ దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశాయి.
ఈ దేశం ఫెడరల్ స్ఫూర్తి కలిగిన దేశం. కానీ మోదీ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. బీజేపీ రాజ్యాంగేతర శక్తిగా మారుతోంది. ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నారు. భారతదేశం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.
బీజేపీ అరాచకాన్ని ఎలాగైనా ఆపాలని? బీజేపీపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆయనకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. కేంద్రంపై కేసీఆర్ పోరాడటం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుంది. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఆర్ఎస్ఎస్, బీజేపీతో ఈ దేశానికి ముప్పు పొంచి ఉంది. గవర్నర్లు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చే పనిలో బీజేపీ గవర్నర్లు నిమగ్నమయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రమాదంలో పడింది. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది. మనం కలిసికట్టుగా ఉంటే బీజేపీని ఓడించగలం. వన్ పార్టీ, వన్ లీడర్ పాలసీతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. మోదీ.. అంబానీ, అదానీతో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలిగించాలి అని డీ రాజా పిలుపునిచ్చారు.