- జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితిపై బీజేపీ గురి?
- దేశ వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయనున్నబీజేపీ
- వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
విధాత: దేశ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. 60 ఏళ్లకు పైగా ఎదురులేకుండా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు కనుమరుగు అవుతుందా? అన్న స్థితికి చేరుకుంది. ఒక అతిపెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకున్నది. కాంగ్రెస్ స్థానంలో అత్యధిక స్థానాలు దక్కించుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ
కాంగ్రెస్ ముఖ్త్ భారత్ పేరిట కాంగ్రెస్ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపే అవకాశం లేకుండా బీజేపీ అనేక విధాలుగా కుయుక్తలు పన్నుతున్నది. ఈ మేరకు అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తమ బలాలను పెంచుకోవడానికి అవకాశం కలిగించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నాలు విజయవంతంగా నిర్వహిస్తున్నది.
ఇందుకు ఎంఐఎం, ఆప్ పార్టీలను పావులుగా ఉపయోగించింది. ఈ ఫార్ములా గుజరాత్‌లో విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ఇదే ఫార్ములా ఉపయోగించి కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే వ్యూహాలకు బీజేపీ మరింత పదును పెడ్తున్నది. గుజరాత్‌లో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉందన్నది వాస్తవం. అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలిచింది. చాలా స్థానాల్లో కొద్ది ఓట్ల తేడాతోనే ఓడినట్లు ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. ఇక్కడ ఎంఐఎం, ఆప్ పార్టీ అనేక సీట్లలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌నే చీల్చాయి.
ఈ మేరకు స్థానిక ఎంఐఎం నేతలు కూడా ఈ రాష్ట్రంలో మనం పోటీ చేస్తే బీజేపీ లబ్ధి పొందుతుందని, పోటీ చేయవద్దని లేఖ రాసినట్లు సమాచారం. అయినప్పటికీ ఎంఐఎం అక్కడ పోటీ చేసి సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను చీల్చి పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూర్చింది. ఇదే తీరుగా ఇక్కడ ఆప్ కూడా వ్యవహరించింది. బీజేపీలో సీట్లు లభించని వారికి ఆప్ టికెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దమయ్యారు.
ఇదే తీరుగా ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాగే వ్యవహరించి సమాజ్ వాదీ పార్టీ విజయాన్నిఅడ్డుకున్నది. గోవాలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టలు తమకు ఏమాత్రం పోటీ కాదన్నట్లుగా వ్యవహరించింది. గోవాలో ఆప్‌తోనే తమకు పోటీ అని చెప్పింది.
కానీ గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుంది. కర్నాటక, మధ్య ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ, వచ్చే ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీని నామమాత్రపు పార్టీగా మార్చే ప్రయత్నాలు విస్తృతం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతోనే తమకు పోటీ అన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నది.
ఇతర పార్టీలలోని బలమైన నేతలపై గురి
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నబలమైన నేతలపై బీజేపీ గురి పెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌లో ప్రజాధరణ ఉన్ననేతలు ఎవరు? వారి ఆర్థిక, అంగ బలం ఎంత? వారి వ్యాపారాలు ఏమిటి? వారికి మనం ఏవిధంగా సహకరించగలం? వాళ్లు మనతో ఏవిధంగా ఉంటారు? అనేదానిపైనే కేంద్రీకరించి బీజేపీ పని చేస్తున్నది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ఉన్న బలమైన నేతలపై బీజేపీ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఇదే విధానాన్ని దేశంలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాలపై అమలు చేయనున్నట్లు తెలిసింది. ఒక వైపు కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్లు చీల్చడానికి ఎంఐఎంను ఓ వైపు వినియో గిస్తూనే.. మరో వైపు ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్రాంతీయ పార్టీలతోనే తమకు పోటీ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఈ మేరకు తమకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాలను, సోషల్ మీడియాను బాగా వినియోగి స్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో తమకు ప్రధాన పోటీ అన్న ప్రచారాస్త్రాన్ని ఉపయోగించిన బీజేపీ, ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలకు చెందిన వ్యాపార సంస్థలు, నేతలు, ఇతర అవినీతి కుంబకోణాలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల చేత దాడులు చేయిస్తున్నాయి. ఆ క్రమంలో లొంగ దీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలలో కూడా జరుగుతున్నది. ఇలా దేశ వ్యాప్తంగా బీజేపీ అవలంబిస్తున్న తీరుపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పార్టీ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ నేతలపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్‌ను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నదన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది.