Site icon vidhaatha

మద్యంతో గెలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు: మంత్రి హరీశ్ రావు

విధాత: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. డబ్బు, మద్యంతో గెలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని విమర్శించారు.

గత ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరోజైనా ఈ గ్రామానికి వచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడూ కనపడని రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుందామా? లేక అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ను గెలిపించుకుందామా? అని మంత్రి ప్రశ్నించారు.

ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని… ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారని.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే రూ.700 పెన్షన్ ఇస్తున్నారని..అలాంటప్పుడు తెలంగాణలో రూ.3వేల పెన్షన్ ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తానట్టుగా వీరి వ్యవహార శైలి ఉందని విమర్శించారు.

Exit mobile version