Site icon vidhaatha

మిర్యాలగూడలో ‘BLR’ హవా.. గ్రూపుల రచ్చకు సేవాస్త్రంతో చెక్!

విధాత: మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల రగడ పార్టీ పురోగతికి బ్రేక్ లేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం తనదైన సేవా కార్యక్రమాలతో జనంలోకి దూసుకెళ్తున్నారు. గ్రూపుల లొల్లితో సతమతమవుతున్న మిర్యాలగూడ కాంగ్రెస్ ను ఒడ్డున పడేసే దిశగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన బత్తుల లక్ష్మారెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తూ.. నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు.

బీఎల్ఆర్ బ్రదర్స్ పేరుతో నియోజకవర్గంలో వైకుంఠపురి రథాలను అందించి, అంత్యక్రియలకు హాజరైన వారికి తన తండ్రి పేరుతో ఈశ్వర బంధం పథకంతో భోజన వసతి అందిస్తున్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు శ్రీనివాస కళ్యాణమస్తు పేరుతో పెళ్లి ఖర్చులను అందిస్తున్నారు. వాహనాదారులకు రక్షణ కోసం హెల్మెట్లు భారీగా పంపిణీ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రి తరలించేందుకు ఆంబులెన్స్ ల వసతి కల్పించారు.

కొత్తగా ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం లబ్ధిని పేద బాలికలు పొందేందుకు వీలుగా బాలికలకు అకౌంట్లు తెరిపించి వారి పేరున కావాల్సిన డిపాజిట్ మొత్తాల జమకు ఏర్పాట్లు చేశారు. ఇలా ఎవరికి ఏ సాయం కావాలన్నా తానున్నానంటూ బత్తుల లక్ష్మారెడ్డి చేస్తున్న సహాయం నియోజకవర్గం ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది.

కేవలం రాజకీయ కార్యక్రమాలకు పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్న బత్తులకు ప్రజాదరణ పెరుగుతున్న తీరు కాంగ్రెస్ లోని మిగతా ఆశవాహులకు సంకటంగా తయారైంది. పార్టీలో తమ ప్రాబల్యం కాపాడుకునేందుకు వారు తమ వర్గాలను పెంచి పోషించడం కాంగ్రెస్ పార్టీ మనుగడకు ప్రతికూలంగా మారుతుంది.

ఎన్నికల పర్వంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డాగా నిలిచిన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి గులాబీ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో తాను గెలిపించుకున్న ఆయన శిష్యుడు నలమోతు భాస్కరరావు హస్తం పార్టీకి చేయిచ్చి బీఆర్ఎస్‌లో చేరి పోయారు. ధీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కొంత బలహీన పడింది.

2018 ఎన్నికల్లో జానారెడ్డి ఇక్కడి నుండి అనూహ్యంగా చివరి నిమిషంలో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి పోటీకి దించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన భాస్కర్ రావు చేతిలో కృష్ణయ్య ఓడిపోవడం జానాకు ఎదురుదెబ్బగా తగిలింది. ఆ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి టికెట్ సాధనలో నిరాశ ఎదురైనప్పటికీ పార్టీలో క్రియాశీలకంగానే పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.

జానా మరో అనుచరుడైన డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ సైతం ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మూడుముక్కలాట మాదిరిగా బత్తుల, అలుగుబెల్లి, శంకర్ నాయక్ ల పేరుతో మూడు గ్రూపులుగా విడిపోవడం పార్టీకి సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై ఆ ముగ్గురిలో సీనియర్ నేత జానారెడ్డి తన ఆశీస్సులు ఎవరికి అందిస్తారన్న ప్రశ్నతో పాటు, తాను లేక తన కుమారుడు జయవీర్ రెడ్డిని పోటీ చేయిస్తారా అన్న ప్రశ్న పార్టీ వర్గాలను గందరగోళ పరుస్తుంది.

వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావు పట్ల, అధికార బిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే వ్యతిరేకతను గ్రూపుల పంచాయతీలతో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకోలేక పోతుంది. ఈ పరిస్థితుల్లో బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం ధైర్యంగా తనదైన సేవా కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలోకి తీసుకెళుతుండటంతో మిర్యాలగూడ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా మారిపోయారు.

బీఆర్ఎస్, సీపీఎంల మధ్య పొత్తుల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కరరావు సీటుకు కోత పడి ఇక్కడి నుండి సీపీఎం బరిలోకి దిగితే బత్తుల లక్ష్మారెడ్డికి మరింత అనుకూల వాతావరణ ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్‌లోని ఆశావహుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జయాపజయాల్లో కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికైతే నియోజకవర్గంలో ఎక్కడ చూసినా, విన్నా జనం బీఎల్‌ఆర్‌ పేరే జపిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు కావాలని టికెట్‌ రాకుండా చేశారనీ అప్పుడే గెలిచే వ్యక్తి అని, మరోసారి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌ రాకుండా అడుకున్నా ఇండిపెండెంట్‌గానైనా బీఎల్‌ఆర్‌ను గెలిపించుకుంటామని మద్దతుదారులు అనుకుంటున్నారు.

Exit mobile version