Bonala Utsavam
విధాత: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సీఎం కేసీఆర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహంకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఉదయం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దంపతులు కూడా అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు సైతం అమ్మవారికి బోనాలు సమర్పించారు.
మహంకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం ప్రతిఏటా వైభవంగా నిర్వహిస్తోంది. ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజిస్తూ.. ప్రారంభమయ్యే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. స్థానికులు డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ.
ప్రజల వేషభాషలను ప్రతిబింబిస్తూ వారిలో ఐక్యత పెంపొందించేలా బోనాల పండగ సాగుతుంది. జంటనగర వాసులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణకు పెద్ద సంఖ్యలో తరలిరాగా పోలీసులు, దేవాదాయశాఖ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం భక్తుల రద్ధీ క్రమబద్ధీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.