విధాత: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువకుడు తన ప్రియురాలిని అపహరించాడు. తన స్నేహితుల సహాయంతో యువతి ఇంటి వద్దకు వెళ్లిన ఆ యువకుడు.. తెల్లవారుజామున 5:20 గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు.
అనంతరం ప్రియురాలిని ఎత్తుకుని బయటకు వచ్చి ఆ తర్వాత కారులో బలవంతంగా ఎక్కించాడు. యువతి కిడ్నాప్‌ను అడ్డుకోబోయిన ఆమె తండ్రిని వారు తోసేసి, కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఏడాది క్రితమే పెళ్లి..?
అయితే అపహరణకు గురైన యువతిని అదే గ్రామానికి చెందిన కట్కూరి జాన్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాగా, ఆమె మైనర్ అని తేలింది. ఈ క్రమంలో జాన్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే రెండు రోజుల క్రితం ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగినట్లు జాన్‌కు తెలిసిందని సమాచారం. ఇక తన ప్రియురాలు తనకు దక్కదేమో అనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం ఆమెను జాన్ అపహరించి ఉంటాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.