Site icon vidhaatha

విద్యార్థుల భవిష్యత్తు కోసం చొప్పదండి ఎమ్మెల్యే ఉదారత్వం

పదవ తరగతి విద్యార్థుల అల్పాహారం కోసం

శాసన సభ్యుడి వేతనం నుండి లక్ష 50 వేల విరాళం

విధాత బ్యూరో, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం ఉదారత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతూ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చారు. శాసనసభ్యుడిగా తన తొలి వేతనం నుండి లక్ష 50 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ పమేలాసత్పతికి అందజేశారు. మార్చి నెలలో జరగనున్న పదవతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ సాయంత్రం పూట అల్పాహారం అందించడం కోసం ఆయన ఈ మొత్తాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఉంటారని, సాయంత్రం పూట నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులలో వారి ఆకలి తీర్చితే వారు చదువుపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. తన బాల్యంలో ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నానని, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే విషయంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version