Site icon vidhaatha

రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు ఆరేళ్లలో కూలింది: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చను ప్రారంభించిన ఉత్తమ్

విధాత: రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు ఆరేళ్లలో కూలింది: పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చను ప్రారంభించిన ఉత్తమ్ ఉళేశ్వరం ప్రాజెక్టు నుంచి 2019 నుంచి 2023 వరకు లిఫ్ట్ చేసింది కేవలం 162 టీఎంసీలు మాత్రమేనని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు భోజన విరామం తర్వాత ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ నివేదికపై తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. 162 టీఎంసీల నీళ్లలో 30 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల ప్రాజెక్టుతో ఐదేళ్లలో101 టీఎంసీలను మాత్రమే ఉపయోగించారని మంత్రి వివరించారు. ఏడాదికి సగటున 20 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారని ఆయన తెలిపారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు పెరగలేదని ఆయన విమర్శించారు.

బరాజ్ కట్టినా డ్యామ్ గా వినియోగించినందునే మేడిగడ్డ కూలిపోయిందని ఆయన విమర్శించారు. కెపాసిటీకి మించి స్టోరేజీ చేసినందునే బరాజ్ డ్యామేజీ అయిందన్నారు. అధికారులు హెచ్చరించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేకపోయినా రికార్డు స్థాయిలో తమ ప్రభుత్వం పంట పండించిందని ఆయన అన్నారు. మేడిగడ్డ బరాజ్ కూలడానికి చాలా కారణాలున్నాయని ఎన్ డీ ఎస్ఏ తెలిపిందన్నారు. నిర్మాణాలు, నాణ్యతలో కూడా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ తెలిపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే అతి పెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడమని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నష్టం జరగలేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎన్ డీ ఎస్ఏ నిపుణులు తెలిపారు.

లక్ష కోట్ల ప్రాజెక్టు ఆరేళ్లలోనే కూలిపోయిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కూలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ లు నిరూపయోగంగా మారాయని ఆయన ఆరోపించారు. ప్రాణహిత-చేవేళ్ల పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు 2014లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. ప్రాణహిత చేవేళ్లపై 2014 నాటికే రూ. 11 వేల 600 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిన్నదని ఆయన అన్నారు. రూ. 21 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు 20 నెలల్లోనే నిరూపయోగంగా మారాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చేపట్టారని ఆయన గుర్తు చేశారు.

ప్రాణహిత – చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో మూడు లేఖలు రాశారన్నారు. ప్రాణహిత-చేవేళ్ల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమి తెలిపిందని మంత్రి వివరించారు. మేడిగడ్డలో బరాజ్ నిర్మించవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ వద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా చెప్పారన్నారు. వ్యాప్కోస్ డీపీఆర్ ఇవ్వకముందే మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే జీవో ఇచ్చారని ఆయన తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ ఖర్చులను భారీగా పెంచారని మంత్రి విమర్శించారు. బరాజ్ లకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారిందన్నారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు రూ. 38 వేల కోట్లతో పూర్తి అయ్యేదన్నారు. కానీ, దీన్ని రూ.1 లక్షా 47 వేల కోట్లకు పెంచారని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తోందన్నారు. శాసనసభలో చర్చించాకే చర్యలు ఉంటాయని చెప్పామన్నారు. బరాజ్‌ల డిజైన్లలో రాంగ్ ప్లానింగ్ ఉందని కమిషన్ వివరించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు బరాజ్ లలో నీటిని నిల్వ చేయలేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కోరిన విషయాన్ని మంత్రి తెలిపారు. తాము ఎక్కడా కూడా కక్షసాధింపు ధోరణితో వెళ్లలేదన్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి నివేదికను కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ఎలా అంటారని మంత్రి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ చేసిన పనుల వల్ల రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగిందన్నారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టకుండా చూడాలని కోర్టుకు వెళ్లింది ఎవరని ఆయన ప్రశ్నించారు. అప్పటి సీఎం తప్పిదాలు ఉన్నాయని జ్యుడీషీయల్ కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ కూలేందుకు అప్పటి సీఎం, మంత్రే బాధ్యులని కమిషన్ చెప్పిందని మంత్రి విమర్శించారు. ఇంజనీర్లు, ఐఎఎస్‌లు కూడా బాధ్యులని స్పష్టంగా తెలిపిందన్నారు.

Exit mobile version