విధాత, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి..బనకచర్ల..వ్యవసాయ రంగాలపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతి సవాల్ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. అయితే కేటీఆర్ సవాల్ కు కౌంటర్ గా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని చర్చకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. అటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల సవాళ్లు..ప్రతిసవాళ్లలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.
మీ నాన్నను వెంటపెట్టుకుని అసెంబ్లీకి రా : కాంగ్రెస్ మంత్రుల సవాల్
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు ప్రతిసవాల్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దమ్ముంటే ప్రతిపక్షనేత, మీ నాన్న కేసీఆర్ ను తీసుకుని అసెంబ్లీకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసేలా అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లు సవాల్ చేశారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నాయకులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ డ్రామాలు ఆపి..ప్రతిపక్ష నేత కేసీఆర్ తో అసెంబ్లీ సమావేశాలు పెట్టమని లేఖను రాయించాలని..మీ నాన్నను వెంట పెట్టుకుని అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఎవరేమి మాట్లాడారో అన్ని అంశాలపై చర్చిద్దామని వారు సూచించారు. కేసీఆర్ లేఖ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి మేం సిద్ధం అన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని..కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని..సీఎం రేవంత్‌ను హరీష్ ఏం చేయలేరన్నారు. కేసీఆర్ లేఖ రాసిన రాయకపోయినా సంక్షేమంపైన, బనకచర్ల ప్రభుత్వం చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పెడుతామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరి పారిపోయాడు : కేటీఆర్
తెలంగాణ అభివృద్ధిపైన..బనకచర్ల..వ్యవసాయంపైన చర్చకు కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రావచ్చంటూ సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి నేను ప్రెస్ క్లబ్ కు చర్చకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రాకుండా ఢిల్లీకి పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇలానే సవాళ్లు విసిరి మాట తప్పిండని.. అందుకే ఈసారి మేమే ప్రెస్ క్లబ్ బుక్ చేశామని..రేవంత్ తరఫున వేరే మంత్రులు వచ్చినా సరే మేము చర్చకు సిద్ధం అని కేటీఆర్ తెలిపారు. లేదంటే ఇంకో తేదీ, సమయం, ప్లేస్ రేవంత్ రెడ్డి చెప్పినా సరే మేం చర్చకు రెడీ అని కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారా? లేక ఇంకెవరైనా నడుపుతున్నారా..? నీకు చేతకాకపోతే కేసీఆర్‌కు అప్పగించు.. ఏం చేయాలో..అభివృద్ధి అంటే ఏమిటో మేము చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ఈ ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని, ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతురుణమాఫీ పూర్తిగా చేయలేదని..రైతుబంధు వేయడం లేదన్నారు. నీళ్లు ఆంధ్రకు..నిధులు ఢిల్లీకి పోతున్నాయి ఆరోపించారు. నియామకాలు రేవంత్ తొత్తులకు అందుతున్నాయన్నారు. బనకచర్ల కడుతుంటే పచ్చజెండా ఊపుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్ట్ పాలన నడుస్తుందని కేటీఆర్ ఆరోపించారు.