టాలీవుడ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలి : అల్లు సినిమాస్​ ప్రారంభోత్సవంలో రేవంత్

అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఎదగాలని, హాలీవుడ్ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లో జరగాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

Telangana Chief Minister Revanth Reddy speaking at the launch event of Allu Cinemas in Hyderabad

హైదరాబాద్‌లో జరిగిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Praises Tollywood at Allu Cinemas Launch

విధాత వినోదం డెస్క్​ | 12 మార్చి 2026 | హైదరాబాద్​:

అల్లు కుటుంబం ప్రారంభించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిమానాన్ని, అభివృద్ధిపై ప్రభుత్వ ప్రాధాన్యతను వెల్లడించారు.

సినిమా రంగం దేశానికి గొప్ప పేరు తెచ్చే శక్తి కలిగిన పరిశ్రమ అని సీఎం పేర్కొన్నారు. అల్లు కుటుంబం ఈ రంగంలో చేస్తున్న కృషిని అభినందించారు. తాను చిన్నప్పటి నుంచి సినిమా అభిమానినని చెప్పారు. సినిమా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రేక్షకులను కట్టిపడేసే అద్భుత చిత్రాలు ఇప్పుడు వస్తున్నాయని తెలిపారు. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొంది, ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఉదాహరణలని చెప్పారు.

నేను సూపర్​స్టార్​ కృష్ణ అభిమానికి : ముఖ్యమంత్రి రేవంత్​

తెలుగు సినిమా అభివృద్ధిలో ప్రముఖుల పాత్రను గుర్తు చేసుకుంటూ, ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నటుడు కృష్ణ సినిమాల్లో సాహస సన్నివేశాలు చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని చెప్పారు. తాను సూపర్​స్టార్​ కృష్ణ అభిమానినని, చిన్నప్పుడు లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి ఆయన సినిమాలు చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. కృష్ణ ఒక సంవత్సరంలో 15 సినిమాలు చేసేవారని, కానీ ఇప్పుడు కొందరు నటులు ఐదు–ఆరు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సినిమా పరిశ్రమకు ప్రభుత్వ ప్రాధాన్యం

హైదరాబాద్‌లో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి; వేదికపై అల్లు అర్జున్​, అరవింద్​ కూడా ఉన్నారు.

సినిమా సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని సీఎం అన్నారు. అందుకే సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. IT మరియు ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమను కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలుగు సినిమాకు కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ పోటీ కాదని, ప్రపంచ స్థాయిలో పోటీ పడే సత్తా ఉందన్నారు. ఆ విషయం ఇప్పటికే రుజువైందని రేవంత్​ కొనియాడారు.

భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో చిత్రీకరణ రుపుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. కృష్ణానగర్ ప్రాంతం నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, కళాకారులు వస్తున్నారని గుర్తు చేశారు.

సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు సినిమాకు భాష అడ్డంకి కానే కాదని, ప్రపంచవ్యాప్తంగా టాలెంట్‌కి మాత్రమే ప్రాధాన్యం ఉందన్నారు.

Latest News