Allu Cinemas | వాల్ ఆఫ్ ఫేమ్‌పై సోషల్ మీడియాలో చర్చ .. బ‌న్నీతో సినిమా చేసిన ద‌ర్శ‌కుల ఫొటోలు మాత్ర‌మేనా…?

Allu Cinemas | హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో అల్లు కుటుంబం నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ రీసెంట్‌గా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ థియేటర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Mar 13, 2026 1:18 PM IST
Allu Cinemas | వాల్ ఆఫ్ ఫేమ్‌పై సోషల్ మీడియాలో చర్చ .. బ‌న్నీతో సినిమా చేసిన ద‌ర్శ‌కుల ఫొటోలు మాత్ర‌మేనా…?

Allu Cinemas | హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో అల్లు కుటుంబం నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ రీసెంట్‌గా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ థియేటర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ సినిమా టెక్నాలజీతో ఉండటం ప్రత్యేకత. భారతదేశంలో ఇది మూడో డాల్బీ సినిమా స్క్రీన్ కాగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా చెప్పబడుతోంది. అదే సమయంలో ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కావడం విశేషం.

వాల్ ఆఫ్ ఫేమ్‌పై చర్చ

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పలు టెలివిజన్ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా థియేటర్‌లో ఏర్పాటు చేసిన “వాల్ ఆఫ్ ఫేమ్” సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. థియేటర్‌లోని లాంజ్ బాల్కనీలో ప్రముఖ దర్శకుల ఫోటోలతో ప్రత్యేక గోడను ఏర్పాటు చేశారు. ఇందులో రాజ‌మౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్ర‌శాంత్ నీల్‌, రిష‌బ్ శెట్టి, వెట్రిమార‌న్, అట్లీ, మ‌ణిరత్నం, త్రివిక్ర‌మ్ , సుకుమార్, రాజ్‌కుమార్ హిరాణి వంటి దర్శకుల ఫోటోలు కనిపించాయి. అయితే ఈ జాబితా చూసిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేశారు. ఒకటి రెండు సినిమాలతోనే పెద్ద హిట్లు సాధించిన దర్శకుల ఫోటోలు ఉండగా, ఎన్నో సంవత్సరాలుగా గొప్ప సినిమాలు తీసిన దర్శకుల ఫోటోలు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

శంకర్ సహా మరికొందరి పేర్లు చర్చలోకి

ప్రత్యేకంగా ప్రముఖ దర్శకుడు శంక‌ర్ ఫోటో లేకపోవడం గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్రీను వైట్ల వంటి దర్శకుల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. అనేక హిట్ సినిమాలు తీసిన ఈ దర్శకుల ఫోటోలు కూడా ఉండాల్సిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ లిస్ట్ చూస్తే అల్లు అర్జున్‌తో ఇప్పటికే పనిచేసిన లేదా భవిష్యత్తులో పనిచేసే దర్శకులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న విషయం కూడా ఈ చర్చకు కారణమైంది. అలాగే అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకులు బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ వంటి వారి ఫోటోలు లేకపోవడం కూడా చర్చకు దారితీసింది.

మరో గోడపై సీనియర్ దర్శకులకు స్థానం

మొదట్లో పాతకాలపు గొప్ప దర్శకుల ఫోటోలు లేవని విమర్శలు వచ్చినప్పటికీ, మరో గోడలో ప్రముఖ సీనియర్ దర్శకుల చిత్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అందులో కె విశ్వ‌నాథ్‌, దాస‌రి నారాయ‌ణ‌రావు, బాల‌చంద‌ర్, రాఘ‌వేంద్ర‌రావు వంటి దిగ్గజ దర్శకుల ఫోటోలు ఉన్నాయి. అయినప్పటికీ మరికొందరు నెటిజన్లు కె.వి. రెడ్డి, జంధ్యాల, కోదండరామి రెడ్డి, సింగీతం శ్రీనివాసరావు వంటి గొప్ప దర్శకుల ఫోటోలు కూడా ఉండాలని సూచిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ భవిష్యత్తులో పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. హాలీవుడ్ స్థాయిలో కూడా అల్లు అర్జున్ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి ఇలాంటి ఆధునిక సాంకేతికతతో కూడిన థియేటర్లను తీసుకువచ్చినందుకు అల్లు కుటుంబాన్ని అభినందించారు. సినిమా నిర్మాణంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఆ సినిమాను ప్రదర్శించే సరైన స్క్రీన్ లేకపోతే ప్రేక్షకులకు పూర్తి అనుభూతి రాదని ఆయన అన్నారు.

అలాగే ‘అరుంధతి’, ‘బాహుబలి’ వంటి చిత్రాలను ఉదాహరణగా చెబుతూ, అలాంటి సినిమాలను ఉత్తమమైన స్క్రీన్‌పై చూస్తేనే నిజమైన అనుభవం పొందవచ్చని పేర్కొన్నారు. టికెట్ కొనుకుని సినిమా గురించి మాట్లాడటం సులభమే కానీ ఒక సినిమా తీయడం మాత్రం చాలా కష్టమైన పని అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.