Site icon vidhaatha

BRS అభ్యర్థుల ఎంపిక అప్పుడే మొదలయిందా?

విధాత: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా మారుతున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది. కేసీఆర్ జాతీయ జ‌ట్టులోకి ప్ర‌స్తుత కొంత‌మంది ఎమ్మెల్యేలు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. హైద‌రాబాద్ త‌ప్ప మిగిలిన 16 పార్ల‌మెంటు స్థానాల‌పై గులాబీ బాస్ గురి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఇప్ప‌టి నుంచి అభ్య‌ర్థుల‌ను సిద్ధం చేసుకుని ప్రిపేర్ అయితే దానికి అనుగుణంగా పార్టీ నిర్మాణాన్ని వేగ‌వంతం చేసేలా ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు చెన్నూరు మాజీ శాస‌న‌స‌భ్యుడు న‌ల్లాల ఓదెలు తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి మంచిర్యాల జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ విజ‌య‌లక్ష్మీ తిరిగి గులాబీ గూటికి చేర‌డం ఈ ప‌రిణామాల్లో భాగ‌మే అనుకోవ‌చ్చు. చెన్నూరు ప్ర‌స్తుత ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌ను ఎంపీగా నిల‌బెట్ట‌వ‌చ్చు. అదే జ‌రిగితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకున్న న‌ల్లాల ఓదెలుకు తిరిగి అవ‌కాశం ఇస్తే సిట్టింగ్ స్థానం చేజారి పోకుండా ఉంటుంద‌నేది కేసీఆర్ ఆలోచ‌న అయి ఉండ‌వ‌చ్చు.

క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు స్థానంలో మంత్రి గంగుల‌ను లేదా స‌ర్దార్ ర‌వీందర్ సింగ్‌ను నిల‌బెట్ట‌వ‌చ్చు. అక్క‌డ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లేదా ఈట‌ల రాజేంద‌ర్ ల‌లో ఒక‌రిని నిల‌బెట్టాల‌ని బీజేపీ అధిష్టానం యోచిస్తున్న‌ద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అందుకే సంజ‌య్ అయినా రాజేంద‌ర్ ఇద్ద‌రిలో ఎవ‌రు నిల‌బ‌డినా అక్క‌డే వారికి చెక్ పెట్టాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్‌ క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌గా ప‌నిచేయ‌డంతో పాటు, పూర్వం ఆయ‌న బీజేపీలో ప‌నిచేశారు. దీంతో ఆయ‌న‌కు క‌రీంన‌గ‌ర్‌లో గ‌ట్టి ప‌ట్టే ఉండడంతో గెలుపు ఈజీ అవుతుంద‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇక ఆ స్థానం నుంచి గ‌తంలో పోటీ చేసిన బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వ్య‌వ‌హారాల‌ను అప్ప‌గించాల‌ని అనుకుంటున్నారు.

ఇట్లా ప్ర‌తి అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానంలో అభ్య‌ర్థుల‌ను ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందుగానే ఎంపిక చేసి ప్ర‌చారంలో ముందుండాల‌నేది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తున్న‌ది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత స‌మాచారం తోపాటు పార్టీ నిర్ణ‌యాలు వెలువ‌డ‌వ‌చ్చు.

Exit mobile version