Site icon vidhaatha

BRS | పాత కాపులతోనే.. ఒకచోట మినహా సిట్టింగులకే పట్టం

BRS |

విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో రెండు మార్పులు మినహా సిటింగులందరికీ బీఆర్ఎస్ అధిష్టానం మళ్ళీ టికెట్ కట్టబెట్టింది. పౌరసత్వ సమస్యను సాకుగా చూపుతూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును తప్పించిన అధిష్టానం… ఆయన స్థానంలో చలిమెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం కల్పించింది. కోరుట్లలో సిటింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరిక మేరకు ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.

తమ ప్రాతినిధ్యం లేని మంథనిలో మరోసారి పుట్ట మధుకు, హుజురాబాద్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పోటీ కి అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 8 శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, శాసనసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్న ఆశావహులకు వ్యతిరేకంగా అసమ్మతి, అసంతృప్తులు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోని బీఆర్ఎస్ అధిష్టానం.. ఈ ఎన్నికల్లోను పాత కాపులతోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది.

ట్విట్టర్ వేదికగా చెన్నమనేని అసంతృప్తి

పౌరసత్వ సమస్య కారణంగా టికెట్ కోల్పోయిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఇప్పటికే తన అసంతృప్తి తెలియజేశారు. ‘రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి.. పదవుల కోసం కాదు.. అని కోరుకునే తన తండ్రి మాటను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తా.. నాతో ఉన్న వారందరికీ భరోసా ఇస్తున్నాను.. దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి.. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి.. అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ఆమోదం లభించదు.. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం..’ అంటూ ట్విట్ చేశారు.

వాస్తవానికి చెన్నమనేనికి ఈసారి టికెట్ లభించే అవకాశం లేదని పార్టీ అధిష్టానం పరోక్ష సంకేతాలు ఇస్తూ వస్తోంది. దీంతో టిక్కెట్ల కేటాయింపునకు ఒక రోజు ముందు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలు అందరూ ఎమ్మెల్యే స్వగృహం సంగీత నిలయంలో సమావేశమై తమ మద్దతు చెన్నమనేనికే అని తెల్చి చెప్పారు. పార్టీ మండల శాఖల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, రైతుబంధు సమితి ప్రతినిధులు వంద మందికి పైగా చెన్నమనేని వెంటే ఉన్నామని సంకేతాలు పంపినా, పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు.

రామగుండం ‘కోరుకంటి’కే..

రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్ నేతలందరూ వీధులకెక్కినా పార్టీ అధినాయకత్వం అంతిమంగా టికెట్ ఆయనకే కట్టబెట్టింది. మానకొండూరు, చొప్పదండి, పెద్దపల్లి, జగిత్యాల శాసనసభ్యులపై అసంతృప్తులు, అసమ్మతులు ఉన్నప్పటికీ పార్టీ వాటిని ఖాతరు చేయలేదు. తమ శాసనసభ్యులు లేని హుజురాబాద్, మంథని నియోజకవర్గాల్లో టికెట్లు దక్కే అవకాశం ఉన్న అభ్యర్థులు పాడి కౌశిక్ రెడ్డి, పుట్ట మధుకు వ్యతిరేకంగా అసంతృప్తి గళాలు వినిపించినా చివరకు వారికే టికెట్లు కట్టబెడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version