Site icon vidhaatha

పాలేరు టికెట్ నాదే | BRSలో ‘తోక’ చిచ్చు.. కలకలం రేపుతున్న ‘కందాల’ వ్యాఖ్యలు!

విధాత: BRS కమ్యూనిస్టుల పొత్తు అధికార పార్టీలో రేపుతున్న చిచ్చుకు ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రేగుతున్న ఆందోళన మరోసారి రచ్చ కెక్కింది. ఖమ్మంలో సీఎం కేసీఆర్ పంట నష్టం పరిశీలన పర్యటనలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర సారధులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంలు కేసీఆర్‌కు కుడి, ఎడమలుగా వ్యవహరించిన తీరు మరవక ముందే పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని వచ్చే ఎన్నికల్లో పాలేరు బీఆర్ఎస్ టికెట్ నాదే.. గెలుపు నాదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహజంగానే కందాల వ్యాఖ్యలు బీఆర్ఎస్‌తో పొత్తు ఆశిస్తున్న కమ్యూనిస్టు పార్టీల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయనటంలో సందేహం లేదు. అసలు సీఎం కేసీఆర్ ఆలోచనలకు భిన్నంగా కందాల అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?? పార్టీ లైన్లోనే ఆయన మాట్లాడి ఉంటారా.. అన్న చర్చ అటు బీఆర్ఎస్‌లో.. ఇటు వామపక్షాల్లో సాగుతుంది.

సీఎం కేసీఆర్ ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తామంటూ వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు దిశగా సాగుతుంటే బీఆర్ఎస్ సీటింగ్ ఎమ్మెల్యేలు అందుకు భిన్నంగా మాట్లాడే సాహసం చేయడం వామపక్ష నేతలను ఆలోచనలో పడేస్తుంది. సిట్టింగ్‌లకే టికెట్లన్న సీఎం కేసీఆర్ ప్రకటన ధైర్యంతోనే వారు పైకి మేకపోతు గాంబీర్యంతో వామపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న వాదన సైతం వినిపిస్తుంది. బీఆర్ఎస్ వామపక్షాల మధ్య పొత్తుతో ఎక్కడ తమ సీట్లకు కత్తెర పడుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ సీట్టింగ్ ఎమ్మెల్యేలను పొత్తుకు వ్యతిరేకంగా పురికొల్పేలా చేస్తుంది.

బీఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా సీపీఎం ఖమ్మం జిల్లాలో పాలేరు, భద్రాచలం స్థానాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నకిరేకల్ స్థానాలు ఆశిస్తుంది. సీపీఐ ఖమ్మంలో కొత్తగూడెం, వైరా, చినపాక, కరీంనగర్‌లో హుస్నాబాద్ ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, నల్లగొండలో మునుగోడు, దేవరకొండ స్థానాలు కోరుతుంది. అలాగే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం స్థానాలపై కూడా వామపక్షాలు కన్నేశాయి.

బీఆర్ఎస్‌లో తోక చిచ్చు

స్వయంగా గతంలో సీఎం కేసీఆర్ తోక పార్టీలు, సూది దబ్బడం పార్టీలని తీసిపారేసిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. సిట్టింగ్ సీట్లను కమ్యూనిస్టు పార్టీలు కోరుతుండడంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఏ ముసలం పుడుతుందోనన్న వాదన కేడర్లో వినిపిస్తుంది. తన రాజకీయ అస్తిత్వానికి సవాల్ విసిరిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వామపక్షాలతో సీఎం కేసీఆర్ పొత్తుకు సిద్ధపడ్డారు.

బీజేపీ వ్యతిరేకత ఏక సూత్ర ప్రాతిపదికన బీఆర్ఎస్, సీపీఎం(ఐ)లు ఒకటయ్యాయి. అయితే అప్పటిదాకా బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోరాడిన వామపక్ష శ్రేణులు బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి. బీఆర్ఎస్‌తో పొత్తు లేకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, లిక్కర్ కేసు, పంట నష్టం సమస్యలపై వామపక్ష శ్రేణులు ఇప్పటికే విధుల్లో రచ్చ రచ్చ చేసి ఉండేవి.

రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకత పెరిగిపోతూ ప్రతిపక్షాలు బలపడుతున్న క్రమంలో అటు బీఆర్ఎస్‌ పొత్తు ఆలోచన వదులుకునే స్థితిలో లేదు. మరోవైపు తెలంగాణలో నామ మాత్రంగా మారిపోయి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని దీనస్థితిలోకి పడిపోయిన కమ్యూనిస్టులు సైతం భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల కోసం పొత్తు ఆశిస్తున్నాయి.

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్‌, కమ్యూనిస్టులకు ఇద్దరికి పొత్తు ఉభయకుశలోపరిగా తయారైంది. అయితే తమ సీట్లు ఎక్కడ వామ పక్షాలు ఎగరేసుకు పోతాయోనన్న ఆందోళనతో ఉన్న బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లు పొత్తు పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. అటు వామపక్ష నాయకత్వం పొత్తుల ఆలోచన మేరకు ఆ పార్టీల కేడర్ కూడా క్షేత్రస్థాయిలో ఇంకా సానుకూలంగా కదలడం లేదు.

అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించడంలో పొత్తుతో సఫలమైన బీఆర్ఎస్‌, వామపక్షాలు రానున్న ఎన్నికల్లో కూడా తమ పొత్తు కొనసాగించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాయి. అదే సమయంలో పొత్తుపై బీఆర్ఎస్ సిట్టింగ్‌ల నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎందుకైనా మంచిదనుకొని ముందుచూపుతో వామపక్షాలు తమకు అంతో ఎంతో బలమున్న సీట్లలో ఒంటరిగానైనా పోటీ చేసేందుకు కూడా ఇప్పటి నుండే తమ సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇటీవల సీపీఎం జనచైతన్య యాత్రలను సైతం చేపట్టడం గమనార్హం.

Exit mobile version